logo

గాలి నాణ్యత పైనా గాలిమాటలే..

అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు బోధిస్తున్న అత్యున్నత విశ్వవిద్యాలయం జేఎన్‌టీయూలో వాతావరణం.. కాలుష్యాన్ని ఇట్టే పసిగట్టి చెప్పేసే వాతావరణ కేంద్రం అలంకారప్రాయంగా మారింది.

Published : 29 Mar 2023 02:09 IST

జేఎన్‌టీయూలో వాతావరణ కేంద్రం

ఈనాడు,హైదరాబాద్‌, కూకట్‌పల్లి, న్యూస్‌టుడే: అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు బోధిస్తున్న అత్యున్నత విశ్వవిద్యాలయం జేఎన్‌టీయూలో వాతావరణం.. కాలుష్యాన్ని ఇట్టే పసిగట్టి చెప్పేసే వాతావరణ కేంద్రం అలంకారప్రాయంగా మారింది. నగరంలో ఏ విశ్వవిద్యాలయంలోనూ లేని వాతావరణ కేంద్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన అదికారులు దాని నిర్వహణను పట్టించుకోకపోవడం వల్ల అక్కడ ఏం జరుగుతోందో తెలియని స్థితి. వాతావరణం, గాలి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఓ అగ్రదేశానికి చెందిన వర్సిటీ వారితో కలిసి వాతావరణ కేంద్రాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. ఇంకేముంది గాలి నాణ్యత.. వర్షపాత సమాచారం ఇట్టే తెలుసుకోవచ్చని వర్సిటీ అధికారులు భావించారు. కానీ ఒక్కరోజు కూడా సమాచారం నమోదు కాకపోగా.. అసలు మొత్తానికే పనిచేయని దుస్థితి.

ఆరునెలల క్రితం ఆర్భాటంగా... జేఎన్‌టీయూలో వాతావరణ మార్పులపై అంతర్జాతీయ సదస్సు గతేడాది సెప్టెంబర్‌ చివరలో జరిగింది. ఇందులో భాగంగా వాతావరణంలో వస్తున్న మార్పులు.. గాలిలో లోపిస్తున్న నాణ్యత.. పెరుగుతున్న కాలుష్యంపై దేశ, విదేశాల నుంచి వచ్చిన సాంకేతిక నిపుణులు చర్చించారు. ఇదే సందర్భంలో వర్సిటీ గ్రంథాలయం భవనంపై అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన కునీ యూనివర్సిటీ వారు గతేడాది సెప్టెంబర్‌ 28న  వర్షపాతం నమోదు, గాలి నాణ్యత తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తూ పరికరాన్ని పరీక్షించి చూపించారు. వర్సిటీ చుట్టుపక్కల వర్షపాతం, గాలి నాణ్యత ఇట్టే తెలుసుకోవచ్చని.. ఎప్పటికప్పుడు నమోదవుతుందని వారు ప్రయోగాత్మకంగా వివరించారు. దీంతో వర్సిటీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన కేంద్రం ఏర్పాటుకు నిధులు సమమకూర్చారు. 

పనిచేయని వాతావరణ అధ్యయన పరికరం

గాలి లేదు... వాన అసలే లేదు..

వాతావరణంలో మార్పులను వేగంగా తెలుసుకునేందుకు సాంకేతిక పరికరాలను వాతావరణ కేంద్రంలో ఏర్పాటు చేశారు. విద్యార్థులు వాతావరణ కేంద్రం గురించి తెలుసుకునేందుకు వెళ్లగా.. ‘ప్రస్తుతం సాంకేతిక సమస్యలున్నాయి... వీటిని పరిష్కరించాక మీరు రండి’ అంటూ వెనక్కు పంపుతున్నారు. మరోవైపు వాతావరణ కేంద్రం పనిచేసే విధానంపై కొందరు అధ్యాపకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్‌నెట్‌ సాయంతో పనిచేసే ఈ పరికరాన్ని వర్సిటీ సాంకేతిక నిపుణులు పలువురు ఇప్పటికే పలువిధాలుగా పరీక్షించారు. దీన్ని ఏర్పాటు చేసిన కునీ వర్సిటీ వారితోనే ఇక్కడున్న అధికారులు సంప్రదిస్తున్నారు. వ్యవహారం సంప్రదింపులు దాటి బయటకు రావడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని