logo

భారాస అంటే ప్రగతి.. భాజపా అంటే అధోగతి

భారాస ప్రజలు మెచ్చుకునే పని చేస్తుంది.. భాజపా ప్రజల మధ్య చిచ్చుపెట్టే పనులు చేస్తూ రాజకీయంగా లబ్ధిపొందుతుంది.. అని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

Published : 29 Mar 2023 02:09 IST

ఆదానీ ఆస్తులు పెంచేందుకే కేంద్రం ప్రయత్నం: మంత్రి హరీశ్‌రావు

దివ్యాంగునికి స్కూటీ తాళం అందజేస్తున్న మంత్రి హరీశ్‌రావు, చిత్రంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: భారాస ప్రజలు మెచ్చుకునే పని చేస్తుంది.. భాజపా ప్రజల మధ్య చిచ్చుపెట్టే పనులు చేస్తూ రాజకీయంగా లబ్ధిపొందుతుంది.. అని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం పటాన్‌చెరులో రూ.10 కోట్లతో మంచినీటి పైప్‌లైన్‌కు శంకుస్థాపన, దివ్యాంగులకు స్కూటీల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పటాన్‌చెరు మైత్రీ మైదానంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి చెందిన జీవీఆర్‌ ఫౌండేషన్‌ సౌజన్యంతో 250 మంది దివ్యాంగులకు స్కూటీలను పంపిణీ చేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, ధరలు పెంచేస్తే... భారాస ప్రభుత్వం తన ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తోందన్నారు. భాజపాను నమ్ముకుంటే అధోగతే అవుతుందని దుయ్యబట్టారు. అదానీ అస్తులు పెంచే ప్రభుత్వం కావాలా? పేద ప్రజల ఆస్తులు పెంచే పార్టీ కావాలా? అన్నది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. పటాన్‌చెరులో రూ.250 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి త్వరలోనే శంకుస్థాపన చేసి అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఎమ్మెల్యే కోరిక మేరకు ముఖ్యమంత్రితో మాట్లాడి పటాన్‌చెరులో సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయం ఏర్పాటు చేయిస్తామన్నారు. శివానగర్‌లో ఎల్‌ఈడీ పార్కు ఏర్పాటు చేస్తున్నామని దానివల్ల ఏ కాలుష్యం ఉండదని తెలిపారు.  ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జడ్పీ ఛైర్‌పర్సన్‌ ముంజుశ్రీ, వైస్‌ ఛైర్మన్‌ ప్రభాకర్‌, జేసీ వీరారెడ్డి, దివ్యాంగులు రాష్ట్ర ఛైర్మన్‌ వాసుదేవరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని