logo

డిమాండ్‌ ఉన్న పంటలే సాగు చేయాలి: మంత్రి

మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలను రైతులు సాగు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో మంగళవారం జరిగిన ద్రాక్ష క్షేత్ర దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Published : 29 Mar 2023 02:09 IST

ద్రాక్ష గుత్తి కోస్తున్న సబితారెడ్డి

మహేశ్వరం, న్యూస్‌టుడే: మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలను రైతులు సాగు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో మంగళవారం జరిగిన ద్రాక్ష క్షేత్ర దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తమ రైతు కొమ్మిరెడ్డి అంజిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ద్రాక్ష సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి ద్రాక్ష కోతను లాంఛనంగా ప్రారంభించారు. రైతు అంజిరెడ్డి కన్సల్టెంట్ అప్పారావును సన్మానించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒకప్పుడు ద్రాక్ష సాగు పెద్దఎత్తున సాగేదని హైదరాబాద్‌ క్రమేణా విస్తరించడం, స్థిరాస్తి వ్యాపారం నేపథ్యంలో తగ్గిపోయిందని, మళ్లీ కొత్తగా రైతులను ప్రోత్సహించనున్నామని తెలిపారు. ఉద్యానరంగంలో అపారమైన అవకాశాలు ఉన్నందున నికర ఆదాయం ఇచ్చే కొత్తపంటలను ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్‌ తమకు చెబుతుంటారని అన్నారు.  ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌, మెదక్‌ తదితర జిల్లాల్లో ద్రాక్ష  సాగుకు చేయూత ఇస్తామన్నారు. కోహెడలో ఏర్పాటు చేయబోతున్న సమీకృత మార్కెట్లో ఈ రైతులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామన్నారు. వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, విజ్ఞప్తులపై రైతు అంజిరెడ్డి పేర్కొన్న అంశాలను సీఎం దృష్టికి తీసుకెళతామన్నారు. ఉద్యానశాఖ ఉప సంచాలకులు డా.సునందారెడ్డి మాట్లాడుతూ ఆసక్తిగల రైతులకు శిక్షణ ఇచ్చి మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించేందుకు ఉద్యానశాఖ ప్రయత్నిస్తోందన్నారు. కార్యక్రమంలో ఏడీహెచ్‌ సంజయ్‌కుమార్‌, ఏడీఏ సుజాతరెడ్డి, రైతు అంజిరెడ్డి, తుక్కుగూడ కమిషనర్‌ వెంకట్రామ్‌, వైస్‌ ఛైర్మన్‌ వెంకట్రెడ్డి, మాజీ సర్పంచులు నర్సింహారెడ్డి, సుభద్రరెడ్డి, ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని