logo

ప్రశ్నపత్రాల కేసులో ముగిసిన నిందితుల కస్టడీ

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితులు ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి, ఢాక్యానాయక్‌, రాజేశ్వర్‌నాయక్‌ల మూడ్రోజుల కస్టడీ ముగిసింది.

Published : 29 Mar 2023 02:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితులు ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి, ఢాక్యానాయక్‌, రాజేశ్వర్‌నాయక్‌ల మూడ్రోజుల కస్టడీ ముగిసింది. ఈ నలుగురిని హిమాయత్‌నగర్‌ సిట్‌ కార్యాలయంలో సిట్‌ పోలీసులు విచారించి కీలక ఆధారాలు సేకరించారు. కస్టడీ గడువు ముగియడంతో మంగళవారం సాయంత్రం కింగ్‌కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం వీరికి ఏప్రిల్‌ 11 వరకూ రిమాండ్‌ విధించింది. అరెస్టయిన షమీమ్‌, సురేష్‌, రమేష్‌లను ఐదు రోజుల పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ ముగ్గురినీ బుధవారం నుంచి సిట్‌ పోలీసులు విచారించనున్నారు.

బీజేవైఎం నేతలకు షరతులతో కూడిన బెయిల్‌

టీఎస్‌పీఎస్సీ ముట్టడి కేసులో బీజేవైఎం నేతలకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీపై బీజేవైఎం నేతలు ఈనెల 14న నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ క్రమంలో పోలీసులు 10 మంది నేతలను అరెస్ట్‌ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు మంగళవారం వీరికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ప్రతి 3వ ఆదివారం బేగంబజార్‌ పోలీసుల ముందు హాజరవ్వాలని, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని