మర్కటాలను పట్టే మొనగాళ్లుంటే రండహో!
ఒక్క కోతి చాలు.. ఊరంతా పీకి పందిరేయడానికి. అలాంటిది వాటి సంఖ్య వందల్లో వేలల్లో ఉంటేనో.. జరిగే బీభత్సం ఊహాతీతమే.. ప్రస్తుతం మహానగరపాలిక అలాంటి ఇబ్బందికర పరిస్థితినే ఎదుర్కొంటోంది.. వేసవి మొదలవడంతో హైదరాబాద్‌లో వానరాల సమస్య ఒక్కసారిగా పెరిగింది
నిపుణుల కోసం జీహెచ్‌ఎంసీ వెతుకులాట
ఈనాడు, హైదరాబాద్: ఒక్క కోతి చాలు.. ఊరంతా పీకి పందిరేయడానికి. అలాంటిది వాటి సంఖ్య వందల్లో వేలల్లో ఉంటేనో.. జరిగే బీభత్సం ఊహాతీతమే.. ప్రస్తుతం మహానగరపాలిక అలాంటి ఇబ్బందికర పరిస్థితినే ఎదుర్కొంటోంది.. వేసవి మొదలవడంతో హైదరాబాద్‌లో వానరాల సమస్య ఒక్కసారిగా పెరిగింది. ఆహారం, నీటి సమస్యతో అవి జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. అరుస్తూ, కరుస్తూ ఆహారాన్ని ఎత్తుకుపోతూ, ఫలసాయాన్ని పాడుచేస్తూ పౌరులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పశువైద్య విభాగం మరోమారు మర్కటాలను పట్టే నిపుణుల కోసం టెండరు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎల్బీనగర్ జోన్లో సమస్య తీవ్రంగా ఉందని, కోతులను పట్టుకుని క్షేమంగా అడవిలో వదిలేస్తే ఏడాదికి రూ.4.9లక్షలు చెల్లిస్తామని పిలుపునిచ్చింది. అయితే, కోతులు పట్టే నిపుణుల కోసం బల్దియా ఇలా యత్నించడం ఇదే తొలిసారి కాదు. అది రెండేళ్లుగా కొనసాగుతోంది. గతంలో ముషీరాబాద్‌లోని ఓ కుటుంబం కోతులను పట్టుకోవడంలో బల్దియాతో కలిసి చాలా సంవత్సరాలు పనిచేసింది. అప్పటి తరం వారు చనిపోయారని, వారి వారసులు వేరే పనుల్లోకి మారిపోయారని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. వేరే ప్రాంతాల్లో కోతులను పడుతోన్న వారిని నగరానికి తీసుకొచ్చి, పని అప్పగించే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నగరంలో 6వేల కోతులు సంచరిస్తున్నట్లు అంచనా ఉందని, వాటిని బోన్లలో బంధించి, ఎలాంటి హాని జరగకుండా అడవికి చేర్చే యోచన చేస్తున్నామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.