logo

వేసవి ప్రయాణం మరింత సురక్షితం

వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు విహార, తీర్థయాత్రలకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లు కిటకిటలాడుతుంటాయి.

Updated : 30 Mar 2023 04:14 IST

రైళ్లు, స్టేషన్లలో కట్టుదిట్టమైన భద్రత
రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే

వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు విహార, తీర్థయాత్రలకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లు కిటకిటలాడుతుంటాయి. ప్రయాణికుల ఏమరపాటును అవకాశం చేసుకొని దొంగలు, అంతర్రాష్ట్ర ముఠాలు చెలరేగుతుంటాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు రైల్వే పోలీసులు ముందుగానే సిద్ధమయ్యారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సురక్షిత ప్రయాణానికి పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు సికింద్రాబాద్‌ రైల్వే ఎస్పీ షేక్‌ సలీమా తెలిపారు. వేసవి సెలవుల నేపథ్యంలో రైళ్లు, రైల్వేస్టేషన్లలో 500మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంకా ఏమన్నారంటే..

రైల్వేస్టేషన్లలో భద్రత, రైళ్లలో గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాల నుంచి వచ్చే 300 మంది సివిల్‌, ఏఆర్‌, రైల్వేస్టేషన్ల సిబ్బందితో కలిసి 500 మందితో భద్రత కొనసాగుతుందని చెప్పారు. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ స్టేషన్లలో, రైళ్లలో తరచూ తనిఖీలు చేస్తామన్నారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులను గుర్తిస్తే డయల్‌ 100, జీఆర్పీ కంట్రోల్‌ టోల్‌ఫ్రీ 1512కు సమాచారం అందించాలని సూచించారు.

*ప్రయాణికుల వద్ద విలువైన ఆభరణాలు, వస్తువులు ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

* అపరిచిత వ్యక్తులు ఇచ్చే తినుబండరాలు, పానీయాలు తీసుకోవద్దు.

* చాలా మంది ప్రయాణ సమయంలో మెడలోని ఆభరణాలు తీసి బ్యాగులో ఉంచుతున్నారు. వాటినే దొంగలు చోరీ చేస్తున్నారు. సెల్‌ఫోన్లు ఛార్జింగ్‌ పెట్టి నిద్రపోవటం, ఏమరుపాటుగా ఉండటంతో దొంగలు తేలికగా కొట్టేస్తున్నారు.

* కిటికీ పక్కన కూర్చున్న సమయంలో బయట నుంచి మహిళల మెడలోని అభరణాలను దొంగలు లాక్కెళ్తున్నారు. ముందు జాగ్రత్తగా కిటికీలను మూసి ఉంచాలి


దంపతుల మరణం బాధాకరం

సోమవారం హైదరాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలో రైలు పట్టాలు దాటుతూ వృద్ధ దంపతులు మరణించడం చాలా బాధాకరమన్నారు. త్వరగా గమ్యం చేరాలనే ఆత్రుత, దగ్గరదారి అనే ఆలోచనతో చాలామంది పట్టాలు దాటుతున్నారన్నారు. కొందరు సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ ఏమరుపాటుగా ఉంటారన్నారు. రైల్వేస్టేషన్లలో ఫ్లాట్‌ఫామ్‌ వైపునకు వెళ్లేందుకు ఉన్న మార్గాలనే వినియోగించుకోవాలని, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలపై నుంచి మాత్రమే ప్లాట్‌ఫామ్‌ల మీదకు చేరాలన్నారు.


రాళ్లు విసిరే వారిపై కేసులు

సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య ప్రయాణిస్తున్న వందేభారత్‌ రైళ్లపై కొందరు రాళ్లు విసురుతుండటంతో తరచూ అద్దాలు పగిలిపోతున్నాయి. ఇటువంటి చర్యలు ప్రయాణికులకు హాని కలిగిస్తున్నాయని, బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రైల్వే ఆస్తుల ధ్వంసం చట్టరీత్యా నేరమని, రైల్వే చట్టాలు కఠినంగా ఉంటాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని