logo

హైటెక్‌ జూదం ఆట కట్టు

ఓ ఫైనాన్స్‌ వ్యాపారి తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలని పేకాటనే వృత్తిగా పెట్టుకున్నాడు. ఎన్ని ఆటలాడినా తానే గెలిచేలా సాంకేతికతను సిద్ధం చేసుకున్నాడు. 

Published : 30 Mar 2023 02:04 IST

రూ.29 లక్షలు, పరికరాల స్వాధీనం

సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ శ్రీనివాసరావు. పక్కన అదనపు డీసీపీలు శోభన్‌, రషీద్‌, ఏసీపీ

జీడిమెట్ల (హైదరాబాద్‌), న్యూస్‌టుడే: ఓ ఫైనాన్స్‌ వ్యాపారి తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలని పేకాటనే వృత్తిగా పెట్టుకున్నాడు. ఎన్ని ఆటలాడినా తానే గెలిచేలా సాంకేతికతను సిద్ధం చేసుకున్నాడు.  అతని ఆట కట్టించారు బాలానగర్‌ ఎస్వోటీ, బాచుపల్లి పోలీసులు. బుధవారం షాపూర్‌నగర్‌లోని బాలానగర్‌ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏస్‌ఓటీ అదనపు డీసీపీలు శోభన్‌, రషీద్‌తో కలిసి డీసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. బాచుపల్లి ఠాణా పరిధి మయూర ఫార్చున్‌ గ్రీన్‌హౌస్‌లో నివాసముంటున్న మలిపెద్ధి అవినాశ్‌(35) కొన్ని నెలలుగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నాడు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో తయారు చేసిన చైనా మొబైల్‌ను దిల్లీ నుంచి తెప్పించాడు. ఆట ఆడే సమయంలో పక్కనే మొబైల్‌ ఫోన్‌ పెట్టుకుంటాడు. పేక ముక్కలను వేసే క్రమంలోనే పక్కనే ఉన్న మొబైల్‌ వాటిని స్కాన్‌ చేసి, ఇతనికి సమాచారం ఇస్తుంది. తాను గెలిచే అవకాశం ఉంటేనే ఆటను కొనసాగిస్తూ డబ్బు పెడుతుంటాడు. అలా అతను వరుసగా ఆటలో గెలుస్తుండడంతో ఎవరైనా అనుమానం వచ్చి, అక్కడి నుంచి ఫోన్‌ తీసేయాలని చెప్తే.. ఏ మాత్రం ఆలోచించకుండా తీసేస్తాడు. ఇలా జరిగే అవకాశం ఉంటుందని ముందే గ్రహించి తన దగ్గర ముందే సిద్ధంగా ఉంచుకున్న రూ.500 నోట్ల కట్టల మధ్యలో ఓ ట్రాన్స్‌మీటర్‌ను, మరో స్కానింగ్‌ పరికరాన్ని ఉంచుతాడు. వెంటనే ఆ ట్రాన్స్‌మీటర్‌ ఆన్‌ చేస్తాడు. చెవిలో మైక్రోఫోన్‌ ఉండడంతో మళ్లీ పేకముక్కలు వేసినా.. నోట్ల కట్టలోని ఆ స్కానింగ్‌ యంత్రం వెంటనే గుర్తించి మైక్రోఫోన్‌లో చెబుతుంది. ఇలా ఆటను ముందే తెలుసుకొని ఇతరులను మోసం చేశాడు. గత ఐదేళ్ల నుంచి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ వేగు ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం జరిపిన దాడిలో నిర్వాహకుడు అవినాశ్‌తో పాటు పంటర్లు దండు రాజేశ్‌, సోదిశెట్టి రాఘవరావు, తన్నూరు కోటేశ్వరరావు, గప్ప నరేశ్‌కుమార్‌, బాదరు గంగరాజులను అరెస్టు చేసి, రిమాండ్‌కి తరలించినట్లు డీసీపీ తెలిపారు. నిందితుల వద్ద సంబంధిత పరికరాలు, రూ.29,11,850 లక్షలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మొత్తం సొత్తు విలువ రూ.35లక్షలు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో కూకట్‌పల్లి ఏసీపీ చంద్రశేఖర్‌, ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ రాహుల్‌దేవ్‌, బాచుపల్లి ఇన్‌స్పెక్టర్‌ నర్సింహరెడ్డి, ఎస్సై రాజశేఖర్‌ సిబ్బంది పాల్గొన్నారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన వారిని డీసీపీ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని