logo

వరి చేతి కొచ్చే వేళాయె..సన్నాహాలు మొదలాయె

జిల్లాలో రైతులు సాగు చేసిన యాసంగి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రైతులు ఎంపిక చేసుకున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక విత్తన రకాలను బట్టి ఏప్రిల్‌ మూడో వారం నుంచి మే చివరి వరకు దిగుబడులు చేతికి అందనున్నాయి.

Published : 30 Mar 2023 02:27 IST

 లక్షల టన్నుల యాసంగి ధాన్యం సేకరణే లక్ష్యం
న్యూస్‌టుడే, తాండూరు, పరిగి, వికారాబాద్‌ మున్సిపాలిటీ

జిల్లాలో రైతులు సాగు చేసిన యాసంగి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రైతులు ఎంపిక చేసుకున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక విత్తన రకాలను బట్టి ఏప్రిల్‌ మూడో వారం నుంచి మే చివరి వరకు దిగుబడులు చేతికి అందనున్నాయి. ఈలోపే ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయనుంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
120 కేంద్రాలు: జిల్లా వ్యాప్తంగా 120 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అన్ని కేంద్రాల్లో కలిపి 1.75లక్షల టన్నుల నుంచి 2 లక్షల టన్నుల వరకు సేకరిస్తారు. క్వింటాలు ‘ఎ’ గ్రేడు ధాన్యానికి రూ.2,060, సాధారణ రకం ధాన్యానికి రూ.2,040 చొప్పున చెల్లించనున్నారు.

40లక్షల గోనె సంచులు

రైతుల చేతికి అందిన ధాన్యం దిగుబడులను సొంత గోనె సంచుల్లో విక్రయానికి కేంద్రాలకు తరలిస్తారు. రైతులు తెచ్చిన ఉత్పత్తులను కేంద్రాల నిర్వాహకులు పౌరసరఫరాల శాఖ పంపిణీ చేసిన సంచుల్లోకి మార్చి తూకం వేస్తారు. లేదంటే నేరుగా రైతులకే గోనె సంచులను ఇస్తే ఉత్పత్తులను నింపి కేంద్రాలకు తరలిస్తారు. అక్కడ తూకం వేశాక వివరాలను నమోదు చేసి అధికారులు సూచించిన గోదాంలకు నిల్వ కోసం లారీల్లో తరలిస్తారు. గోనె సంచులకు కొరత ఏర్పడితే మొత్తం కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తనున్న నేపథ్యంలో అధికారులు అవసరమైన మేరకు వాటిని సిద్ధం చేశారు.

54,162 ఎకరాల్లో వరి సాగు

జిల్లా వ్యాప్తంగా రైతులు యాసంగి సీజన్‌లో 54,162 ఎకరాల్లో వరిని సాగు చేశారు. సీజన్‌ మొత్తానికి 32,179 ఎకరాల్లో వరి సాధారణ సాగుగా ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. భారీ వర్షాల నేపథ్యంలో కాగ్నా, కాకరవేణి, మూసీ నదులు పొంగి పొర్లాయి. గ్రామాలకు సమీపంలో ఉన్న వాగులు కూడా ఉద్ధృతంగా ప్రవహించాయి. ఈ పరిణామం బోర్లలో భూగర్భ జలం పెరిగేందుకు దోహదం చేసింది. అంచనా వేసిన దానికంటే 21,983 ఎకరాల ఎక్కువతో మొత్తం 54,162 ఎకరాల్లో వరిని సాగు చేశారు. నాట్లు వేసిన నాటి నుంచి పైర్లు కంకులు వేసి గట్టి పడే వరకు అవసరమైన సాగు నీరు అందింది. దీంతో పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. దిగుబడులు కూడా ఆశించిన స్థాయిలో చేతికి అందుతాయనే ఆశలో రైతులు ఉన్నారు.
* 2021 యాసంగిలో 43,785.32 ఎకరాల్లో వరి సాగైంది. గతంలో పోలిస్తే ఈ సీజన్‌లో 10,370.68 ఎకరాల్లో ఎక్కువగా సాగు చేశారు.


ఉన్నతాధికారులు ఆదేశించగానే కార్యాచరణ
- రాజేశ్వర్‌, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి

ఉన్నతాధికారులు ఆదేశించగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. ఈలోగా కేంద్రాల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తాం. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని