logo

ఇసుక విక్రయానికి నూతన పాలసీ: కలెక్టర్‌

కాగ్నాతోపాటు జిల్లాలోని ఇతర నదీ పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంతోపాటు జిల్లా వాసులకు ఇసుక విక్రయించేలా నూతన విధానాన్ని అమలు చేయబోతున్నట్లు పాలనాధికారి నారాయణరెడ్డి తెలిపారు. తాండూరు మండలం ఎల్మకన్నెలో పర్యటించిన ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. 

Published : 30 Mar 2023 02:27 IST

అధికారులతో మాట్లాడుతున్న నారాయణ రెడ్డి

తాండూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కాగ్నాతోపాటు జిల్లాలోని ఇతర నదీ పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంతోపాటు జిల్లా వాసులకు ఇసుక విక్రయించేలా నూతన విధానాన్ని అమలు చేయబోతున్నట్లు పాలనాధికారి నారాయణరెడ్డి తెలిపారు. తాండూరు మండలం ఎల్మకన్నెలో పర్యటించిన ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు.  
పారదర్శకంగా ఇళ్లు పంపిణీ చేస్తాం..  ఇందిరమ్మ ఇల్లు, ఎన్‌టీఆర్‌ కాలనీ, రాజీవ్‌ గృహకల్పలో ఇళ్లు పొందిన వారికి తాజాగా రెండు పడక గదుల ఇళ్ల మంజూరులో అనర్హులుగా ప్రకటించామని ఆయన తెలిపారు. పారదర్శకంగా పంపిణీ జరుగుతుందన్నారు. గతంలో ఇల్లు పొందని వారికి, ఇల్లులేని కుటుంబాలకు కేటాయింపులు ఉంటాయన్నారు.

గణితం ఉపాధ్యాయుడిపై వేటు..  ఎల్మకన్నె చేరుకున్న పాలనాధికారి నేరుగా కాగ్నా నదిలో నిర్మిస్తున్న ఆనకట్ట పనుల్ని పరిశీలించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లి 4, 5వ తరగతి గదిలో విద్యార్థులను పన్నెండో ఎక్కం అడిగితే ఒక్కరూ చెప్పలేకపోయారు. గణితం పుస్తకంలో 13వ పాఠంలోని భిన్నాల గురించి బోర్డుపై రాయమనగా ఇద్దరు విద్యార్థులు తప్పు నమోదు చేశారు. వెంటనే గణితం ఉపాధ్యాయుడు హర్షవర్ధన్‌ను పిలిచి ఆరా తీయగా 5వ తరగతి విద్యార్థులకు పదో ఎక్కం వరకే నేర్పించాల్సి ఉందన్నాడు. అలా అని ఏ పుస్తకంలో ఉందో చూపించాలని పాలనాధికారి ప్రశ్నించారు. నీళ్లు నమలడంతో వెంటనే చరవాణిలో జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవీతో మాట్లాడి  ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.  

* గౌరవగృహాలు, మూత్రశాలలను పరిశీలించగా అపరిశుభ్రంగా ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తు పంచాయతీ కార్యదర్శి సరితకు మెమో జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. తహసీల్దారు చిన్నప్పలనాయుడు, ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి, డీఎల్‌పీఓ శంకర్‌నాయక్‌, పంచాయతీరాజ్‌ శాఖ డీఈ వెంకట్రావ్‌, ఏఈ నందిని, సీడీపీఓ రేణుక, నిర్మల ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని