logo

ఎట్టకేలకు ఏకరూపం డబ్బులొచ్చాయ్‌!

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సరఫరా చేసిన ఏకరూప దుస్తుల తాలూకూ కుట్టుకూలీ డబ్బులను ఎట్టకేలకు మంజూరు చేశారు.

Updated : 30 Mar 2023 04:22 IST

న్యూస్‌టుడే, బొంరాస్‌పేట

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సరఫరా చేసిన ఏకరూప దుస్తుల తాలూకూ కుట్టుకూలీ డబ్బులను ఎట్టకేలకు మంజూరు చేశారు. విద్యా శాఖ అధికారులు పాఠశాల వారీగా పిల్లల సంఖ్య ఆధారంగా జిల్లాకు రూ.1,07,78,800లను విడుదల చేయగా పాఠశాల ఎస్‌ఎంసీ బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.  

జతకు రూ.50

జిల్లాలోని 20 మండలాల్లోని పాఠశాలలకు యూడైస్‌ ఆధారంగా ఒకటి నుంచి పది వరకు విద్యార్థులకు ఏడాదికి రెండు జతల దుస్తులు కుట్టించుకునేందుకు వస్త్రాన్ని సరఫరా చేస్తున్నారు. వాస్తవానికి ఈసారి వస్త్రం రావడం, కుట్టించడం అనేవి ఆలస్యంగానే జరిగాయి. విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చినా ఇంకా కొన్నిచోట్ల రెండో జత దుస్తులు ఇవ్వలేదనే విమర్శలున్నాయి.   అంతేకాదు నాణ్యత విషయంలో కూడా ఆరోపణలొచ్చాయి. ఇలాంటి తరుణంలో ఒక్కొక్కరికి జతకు రూ.50 చొప్పున రెండు జతలకు రూ.100 లెక్కించి కుట్టుకూలీ నిధులు విడుదల చేశారు. 2022-23 విద్యా సంవత్సరానికి జిల్లాలో వివిధ శాఖల యాజమాన్యాల పరిధిలోని 1,099 పాఠశాలల్లో చదువుతున్న 1,07,788 మంది విద్యార్థుల ఏకరూప దుస్తుల కుట్టుకూలీకి గాను సర్వశిక్ష అభియాన్‌ నుంచి నిధులు విడుదల చేశారు.

* గురుకుల, ఆశ్రమ, నమూనా, వసతిగృహాల విద్యార్థులకు కుట్టిన జతలను సరఫరా చేయగా కస్తూర్బా విద్యాలయాల బాలికల దుస్తుల కుట్టుకూలీ నిధులు ప్రత్యేకంగా అందిస్తారు.


విద్యా కమిటీ తీర్మానాలతో చెల్లించాలి: రేణుకాదేవి, జిల్లా విద్యాశాఖాధికారిణి

విద్యార్థుల సంఖ్య ఆధారంగా కుట్టుకూలీ డబ్బులను విడుదల చేశాం. పాఠశాల వారీగా విద్యా కమిటీ బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ప్రధానోపాధ్యాయులు విద్యా కమిటీల తీర్మానాలతో దుస్తులు కుట్టిన ఏజెన్సీలకు కూలీ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఎలాంటి లావాదేవీలకు చోటు ఉండదు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు