logo

పేదల కొట్టు.. తెరిస్తే ఒట్టు!

పేదల అభ్యున్నతికి ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు చేపడుతూ ముందుకు సాగుతోంది. అయితే క్షేత్రస్థాయిలో సరిగా అమలుకు నోచుకోవడంలేదు.

Published : 31 Mar 2023 01:07 IST

సమయపాలన పాటించని డీలర్లు

న్యూస్‌టుడే, వికారాబాద్‌: పేదల అభ్యున్నతికి ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు చేపడుతూ ముందుకు సాగుతోంది. అయితే క్షేత్రస్థాయిలో సరిగా అమలుకు నోచుకోవడంలేదు. ఇందుకు చౌక ధరల దుకాణాలే నిదర్శనం. నెలంతా ఇవి ప్రజలకు అందుబాటులో ఉండాలన్న నిబంధన ఉంది. అయినా డీలర్లు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. తమకు అనువైన సమయంలో దుకాణాలు తెరవడం, వెంటనే మూయడం వంటివి చేయడం గమనార్హం. ఇక కేంద్రాల వద్ద కనీసం నామ పలకాలు కూడా లేకపోవడం వంటి అంశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో 588 చౌక ధరల దుకాణాలున్నాయి. ఆహార భద్రత 2,41,264, అంత్యోదయ 26,698 కార్డులున్నాయి. నెలకు 5,393 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. వికారాబాద్‌ పట్టణం, మండలంలో కలిపి 49 దుకాణాలు ఉన్నాయి. ఎక్కడా సమయానికి తెరిచి ఉంచిన దాఖలాలు కనిపించలేదు. కొన్ని ప్రాంతాల్లో నెలలో నాలుగు రోజులు కూడా తెరవడంలేదన్న ఆరోపణలున్నాయి.


ఒకరి పేరున మరొకరు..

ఒకరి పేరున ఉంటే మరొకరు సరకులను పంపిణీ చేస్తున్నారు. చాలా మటుకు దుకాణాలు బినామీలతోనే కొనసాగుతున్నాయి. జిల్లాలో అన్ని దుకాణాల్లో ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాలు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతుండగా, వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. నిల్వ పుస్తకం, రోజువారీ పుస్తకాలు దుకాణాల్లో ఉండాల్సి ఉండగా, వాటిని ఇళ్ల దగ్గరే పెట్టుకుంటున్నారు. బియ్యం పంపిణీని ఈ-పాస్‌ విధానం ద్వారా చేస్తుండటంతో కొంత మటుకు అక్రమాలకు కళ్లెం పడింది. సంకేతాలు అందకపోవడం, యంత్రాలు పని చేయకపోవడంతో పలు చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇవీ నిబంధనలు..: ప్రతి దుకాణం గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు తెరిచి ఉంచాలి. పట్టణాల్లో ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు తెరిచి ఉంచాలి. ప్రతి దుకాణంలో ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాలు ఏర్పాటు చేయాలి. రేషన్‌ దుకాణం బయట దుకాణం సంఖ్య, కార్డుల సంఖ్య, డీలరు చిరునామా, సరకుల పరిణామం వివరాలతో నామ పలకం ఏర్పాటు చేయాలి.  


పరిశీలించి చర్యలు తీసుకుంటాం
రాజేశ్వర్‌, జిల్లా పౌర సరఫరాల అధికారి

ప్రతి దుకాణంలో ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రం ద్వారానే సరకుల పంపిణీ జరుగుతోంది. నిబంధనలకు లోబడి పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చాం. ఇందుకు విరుద్ధంగా జరిగితే విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని