logo

మూగ మనసు మాకు తెలుసు

కాస్త ప్రేమ చూపితే చాలు. మూగజీవాలు మన చుట్టే తిరుగుతూ మనలో ఒకరిలా కలిసిపోతాయి.

Updated : 31 Mar 2023 05:40 IST

పశు వైద్యశాలల్లో కార్డియాలజీ, 2డీ ఎకో, డయాలసిస్‌ యంత్రాలు
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి సౌకర్యాలు 

పశు వైద్యశాలలో శునకాన్ని పరిశీలిస్తున్న వైద్యులు

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, రాజేంద్రనగర్‌, చేవెళ్ల గ్రామీణం: కాస్త ప్రేమ చూపితే చాలు. మూగజీవాలు మన చుట్టే తిరుగుతూ మనలో ఒకరిలా కలిసిపోతాయి. కేవలం శునకాలు, పిల్లులే కాదు ఆవులు, గేదెలు సైతం మనుషులతో కలివిడిగా ఉంటూ వాటి ప్రేమను చూపుతుంటాయి. మరి అలాంటి  జీవాలు ఏదైనా అనారోగ్యంతో తల్లడిల్లిపోతుంటే ఆ బాధ చెప్పనలవి కానిది.. బయటికి కనిపించే గాయాలకైతే చికిత్స చేయొచ్చు.. కానీ కనిపించని వ్యాధులైతే ఎలా..? నగరంలో కలుషిత ఆహారం.. నీరు తాగి ఎన్నో జీవులు మృత్యువాత పడుతున్నాయి. ఈ ప్రమాదాన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మూగజీవాల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. జంతువుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించేందుకు రంగారెడ్డి.. మేడ్చల్‌ జిల్లాల్లోని పశువైద్యశాలలు, రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ కళాశాలలో ఆధునిక వైద్య పరికరాలతో అనుభవజ్ఞులైన వైద్యనిపుణులను నియమించారు. ఓపీ సేవలతో పాటు అత్యవసర వైద్యసేవలు, శస్త్రచికిత్సలు చేస్తున్నారు. రెండు జిల్లాల్లో 40వేల ఆవులు..గేదెలు, 70వేల మేకలు.. గొర్రెలు, 20వేల పెంపుడు జంతువులున్నాయి. వీటి అవసరాల కోసం ఆసుపత్రుల్లో సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని పశుసంవర్ధకశాఖ వైద్యులు తెలిపారు.  


కార్డియాలజీ, 2డీ ఎకో..  

రంగారెడ్డి.. మేడ్చల్‌ జిల్లాల్లోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగరానికి సమీపంగా ఉండటంతో హైదరాబాద్‌ తరహాలోనే రోడ్లపైనే ఆహారపదార్థాలు పారేయడంతో పాటు నీటివనరులు కలుషిత చేస్తున్నారు. గేదెలు, ఆవులు, పెంపుడు జంతువులు బయటకు వెళ్లినప్పుడు కలుషిత జలాలు తాగుతున్నాయి. రోడ్లపై పడేసిన ఆహారపదార్థాలు తింటున్నాయి. వీటిల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలుండటంతో గుండె సంబంధ జబ్బులు.. మూత్రపిండాల సమస్యలొస్తున్నాయి. వీటిని గుర్తించేందుకు కార్డియాలజీ, 2డీ ఎకో, డయాలసిస్‌ యంత్రాలు, ప్రమాదాల్లో గాయపడి ఎక్కువగా రక్తంపోతే రక్తమార్పిడికి బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌, ఈసీజీ, అల్ట్రాసౌండ్‌, అధునాతన ఎక్స్‌రే మిషన్‌, ఎండోస్కోపీ, వెంటిలేటర్‌, హెమటాలజీ ఎనలైజర్స్‌తో పాటు కొన్ని లోపాలతో జన్మించిన జంతువులకు ప్రత్యేకంగా ఇంక్యుబేటర్లను సిద్ధంగా ఉంచారు.


కార్పొరేట్‌ వైద్యానికి దీటుగా...

నగరంలోని కార్పొరేట్‌ పశు వైద్యశాలలకు దీటుగా రాజేంద్రనగర్‌ వెటర్నరీ కళాశాలలో సౌకర్యాలున్నాయి. ఇటీవలే రూ.40కోట్లతో ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తెచ్చారు. దీంతోపాటు చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, కందుకూరు డివిజన్ల పరిధుల్లో గేదెలు, ఆవులు, గొర్రెలు, పెంపుడు జంతువులకు సకాలంలో వైద్యం అందించేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. గతంలో గర్భం ధరించిన పశువులకు మూడు నెలల వరకు చెయ్యి పెట్టి పిండం ఎదుగుదలను గుర్తించేవారు. ప్రస్తుతం అల్ట్రాసౌండ్‌ ఏర్పాటు చేయడం ద్వారా మూడు నెలల తర్వాత గర్భంలో ఉన్న దూడ పరిస్థితి తెలుసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తున్నారు. టీకాలు భద్రపరిచేందుకు సరైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు.

గుండె పరీక్ష యంత్రం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని