logo

అటెళ్లాలా.. ఇటెళ్లాలా?

విద్యుత్తు మరమ్మతులకు సంబంధించి గ్రేటర్‌ పరిధిలో ఆపరేషన్‌ సిబ్బందికి అదనంగా సెంట్రల్‌ బ్రేక్‌ డౌన్‌(సీబీడీ) బృందాలు ఉన్నాయి.

Published : 31 Mar 2023 02:44 IST

విద్యుత్తు లైన్ల మరమ్మతుల వేళ సీబీడీ బృందాల పరుగులు

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు మరమ్మతులకు సంబంధించి గ్రేటర్‌ పరిధిలో ఆపరేషన్‌ సిబ్బందికి అదనంగా సెంట్రల్‌ బ్రేక్‌ డౌన్‌(సీబీడీ) బృందాలు ఉన్నాయి. అంతరాయాలు ఎక్కడ తలెత్తినా పగలు రాత్రి లేకుండా సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే డివిజన్‌కు ఒకటే బృందం ఉండటంతో దూరాభారంతో సత్వరం హాజరు కాలేకపోతున్నారు. పాతబస్తీ పరిధిలోని డివిజన్లలో రెండు చొప్పున ఇచ్చిన మాదిరే.. ఇతర డివిజన్లలో పెంచాలని కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

హైదరాబాద్‌ సెంట్రల్‌ సర్కిల్‌లోని మెహిదీపట్నం డివిజన్‌ పరిధి నాంపల్లి నుంచి షేక్‌పేట వరకు ఉంటుంది. నాంపల్లిలో అంతరాయం తలెత్తిందని ఫోన్‌ రాగానే అక్కడికి వెళ్లిన సిబ్బందికి.. షేక్‌పేటలో సమస్య ఉందని ఫోన్లు వస్తున్నాయి. దీంతో ఇక్కడి నుంచి అక్కడికి చేరడానికి గంటకు పైగా పడుతోంది. ట్రాఫిక్‌ ఉంటే మరింత ఆలస్యం అవుతోంది. ఒక్కోసారి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తే ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అదనంగా మరో సీబీడీ బృందాన్ని మంజూరు చేయాలని క్షేత్రస్థాయి నుంచి కార్పొరేట్‌ కార్యాలయానికి విజ్ఞప్తులు అందుతున్నాయి. అజామాబాద్‌ డివిజన్‌లోని సీబీడీలో సిబ్బంది తగినంత సంఖ్యలో లేరు. కవాడిగూడలో ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ సెంటర్‌ లేదు. వీటిని మంజూరు చేయాలని అధికారులు కోరుతున్నారు.

ఏం చేస్తారంటే?

గ్రామీణ ప్రాంతాల్లో ఆపరేషన్‌ సిబ్బందే కనెక్షన్ల జారీ, బిల్లుల వసూలు, అంతరాయాలు ఏర్పడితే మరమ్మతులు చేపడతారు. సిటీలో ఆపరేషన్‌ సిబ్బంది కొత్త కనెక్షన్ల జారీ, బిల్లుల వసూళ్లకు పరిమితం. మరమ్మతులు చేపట్టేందుకు డివిజన్‌కు ఒక సెంట్రల్‌ బ్రేక్‌ డౌన్‌ బృందం ఉంటుంది. ఒక ఏడీఈ, నలుగురు ఏఈలు, లైన్‌మెన్‌, ఆర్జిజన్లు కలిపి ఆరు నుంచి 8 మంది సిబ్బంది ఉంటారు. వినియోగదారులకు ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే ఫోన్‌ చేసేందుకు వీలుగా సెక్షన్‌కు ఒక ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌ సెంటర్‌ ఉంటుంది. వీరికి వచ్చే ఫిర్యాదులు సీబీడీ బృందానికి చేరుతాయి. ఆయా ప్రదేశాలకు వెళ్లి మరమ్మతులు చేపడుతుంటారు. నగరంలో అవసరాల దృష్ట్యా ప్రతి డివిజన్‌కు అదనంగా మరో బృందాన్ని ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి. ప్రత్యామ్నాయంగా సీబీడీలో క్షేత్రస్థాయిలో సిబ్బందినైనా పెంచాలనే సూచనలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని