logo

పట్టపగలే బరితెగించారు

రాజేంద్రనగర్‌ సర్కిల్‌ శాస్త్రీపురం సర్వే నంబరు 134బై20లోని రూ.40కోట్ల విలువైన ఎకరా 36 గుంటల స్థలంలో ఉన్న హుడా పార్కును ఆక్రమించేందుకు కొందరు ఉపక్రమించారు.

Published : 31 Mar 2023 02:44 IST

హుడా పార్కు ఆక్రమణకు యత్నం

ఆక్రమణదారులు కూల్చిన గోడలు, చెట్లు

కాటేదాన్‌, న్యూస్‌టుడే: రాజేంద్రనగర్‌ సర్కిల్‌ శాస్త్రీపురం సర్వే నంబరు 134బై20లోని రూ.40కోట్ల విలువైన ఎకరా 36 గుంటల స్థలంలో ఉన్న హుడా పార్కును ఆక్రమించేందుకు కొందరు ఉపక్రమించారు. శ్రీరామనవమి సందర్భంగా అధికారులు లేని సమయంలో గురువారం ఉదయం 10 గంటలకు పార్కులోని క్రీడా పరికరాలు, వృక్షాలను నేలమట్టం చేశారు. నాలుగు జేసీబీలతో కూల్చివేతలు చేపట్టి, మూడు టిప్పర్లతో వ్యర్థాలను తొలగిస్తుండగా.. శాస్త్రీపురం, రాఘవేంద్రకాలనీ ప్రజలు అడ్డుకుని నిలదీశారు. ‘ఈ స్థలం మాది... మేము కొనుగోలు చేశామ’ంటూ ఆక్రమణదారులు రెచ్చిపోయారు. స్థానికుల సమాచారంతో మైలార్‌దేవుపల్లి ఇన్‌స్పెక్టర్‌ మధు తన బృందంతో అక్కడి చేరుకోగా ఆక్రమణదారులు పరారయ్యారు. వృక్ష సంరక్షణ, సర్కిల్‌ సిబ్బంది వచ్చి పార్కును పరిశీలించారు. అది 40 ఏళ్ల కిందటి శాస్త్రీపురం హుడా సొసైటీ స్థలమని స్థానికులు మైలార్‌దేవుపల్లి పోలీసులు, రాజేంద్రనగర్‌ సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. టౌన్‌ప్లానింగ్‌ డీసీపీ కృష్ణమోహన్‌ ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. ఈ పార్కుతో పాటు మరో 11 వందల గజాల మరో పార్కునూ ఆక్రమించుకోవడానికి యత్నిస్తున్నారని స్థానికుడు బాబర్‌ ఆరోపించారు.నాలుగు జేసీబీలు, రెండు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మధు చెప్పారు. శాస్త్రీపురానికి చెందిన అసద్‌ చెబితే తాము ఆ పనులు చేపట్టామని జేసీబీలు, టిప్పర్ల యజమానులు తెలిపారని పేర్కొన్నారు. అసద్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని