logo

ఎగిరొచ్చిన దుప్పటి.. తెగిపడిన తీగలు

నాలుగు అంతస్తుల భవనంపై ఆరేసిన ఓ దుప్పటి ఎగిరొచ్చి విద్యుత్తు తీగలపై పడి, సరఫరా నిలిచిపోయింది.

Published : 31 Mar 2023 02:44 IST

విద్యుత్తు సరఫరాలో అంతరాయం
సైదాబాద్‌ ఠాణాలో ఫిర్యాదు

విద్యుత్తు తీగలపై పడిన దుప్పటిని  తొలగిస్తున్న సిబ్బంది

సైదాబాద్‌, న్యూస్‌టుడే: నాలుగు అంతస్తుల భవనంపై ఆరేసిన ఓ దుప్పటి ఎగిరొచ్చి విద్యుత్తు తీగలపై పడి, సరఫరా నిలిచిపోయింది. ఇది గుర్తించక సరఫరాను పునరుద్ధరించడంతో భారీ శబ్దంతో తీగలు తెగి పడ్డాయి. ఆ సమయంలో రహదారిపై ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. సైదాబాద్‌ హౌసింగ్‌బోర్డులోని ఓ అపార్టుమెంట్‌ నాలుగో అంతస్తుపై ఆరేసిన దుప్పటి బుధవారం గాలిదుమారానికి ఎగిరొచ్చి 11కేవీ విద్యుత్తు తీగలపై పడటంతో సరఫరా నిలిచిపోయింది. అది గమనించని సిబ్బంది కొద్దిసేపటి తర్వాత సరఫరా పునరుద్ధరించటంతో పెద్ద శబ్దంతో తీగ తెగి రహదారిపై పడింది. మరోటి పాక్షికంగా దెబ్బతింది. అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు తీగలపై వేలాడుతున్న దుప్పటిని తొలగించారు. రెండు నెలల క్రితం ఇదే భవనంలో నుంచి దుప్పటి వచ్చి తీగలపై పడి సరఫరాలో ఇబ్బంది తలెత్తింది. అప్పట్లో అందులో నివసించేవారిని విద్యుత్తు సిబ్బంది హెచ్చరించి వదిలేశారు. రెండోసారీ అదే పొరపాటు జరగడంతో అధికారులు సైదాబాద్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యంతో సంస్థకు నష్టం కలిగించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామని సంబంధిత అధికారి తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని