logo

కొలువు సాధించేలా.. భవితకు బాటలు వేసేలా..

సర్కారు కొలువు సాధించేలా యువతకు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తరగతులు ప్రారంభించి గత నవంబరులో పూర్తి చేశారు.

Published : 01 Apr 2023 03:02 IST

ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ
న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ, పరిగి

సర్కారు కొలువు సాధించేలా యువతకు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తరగతులు ప్రారంభించి గత నవంబరులో పూర్తి చేశారు. ఫిబ్రవరిలో ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మొదలయ్యాయి. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌  భవనం కేంద్రంగా కొనసాగుతోంది. గ్రూప్‌ 2,3,4 పరీక్షలకు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు.

ప్రభుత్వం లక్ష వరకు ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుల్‌, గ్రూప్‌-1 నోటిఫికేషన్లు జారీ చేసింది. గ్రూప్‌-1 పరీక్ష పత్రం లీకైన కారణంగా దీనిని రద్దు చేశారు. ఎస్సై, కానిస్టేబుల్‌ పరీక్షలు ఏప్రిల్‌లో, గ్రూప్‌-2 ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు. గ్రూప్‌-3 తేదీని ఖరారు చేయలేదు. గ్రూప్‌-4 పరీక్షలు జులైలో కొనసాగనున్నాయి. ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ప్రారంభించిన శిక్షణ మే8వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందుకోసం నిపుణులైన 10 అధ్యాపకులను నియమించారు.

తొలిసారి: జిల్లాలో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నిత్యం ఉదయం 10 గంటలకు ప్రారంభించి సాయంత్రం 5 గంటల వరకు బోధన చేస్తున్నారు. దోమ, పూడూరు, ధారూర్‌, వికారాబాద్‌, నవాబ్‌పేట, తాండూరు, తదితర మండలాలకు చెందిన 82 మంది పేరు నమోదు చేసుకున్నారు.


అర్థమయ్యేలా..

అంజలి, గుండాల్‌

ప్రారంభం నుంచి శిక్షణ తీసుకుంటున్నా. ఇక్కడ అన్ని అంశాల్లో బాగా బోధిస్తున్నారు. బోధకులు చెప్పేది అర్థం కావడంలేదని నిర్వాహకులకు తెలిపితే కొత్తవారిని కేటాయిస్తున్నారు.


అన్నింటికి సిద్ధమవుతున్నా

సుధారాణి, పూడూరు

గ్రూప్‌ అన్ని పరీక్షలకు సిద్ధం అవుతున్నా. కేంద్రం నిరుపేద విద్యార్థులకు వరం. శిక్షణతో ఎంతో నేర్చుకుంటున్నాం. అంతేకాకుండా బోధన సామగ్రి ఇస్తామన్నారు.


బోధన సామగ్రి అందజేస్తాం

మల్లేశం, షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి

అంబేడ్కర్‌ భవనంలో ఉచిత శిక్షణ ఇస్తున్నాం. ప్రతి విద్యార్థికి నాలుగు నోట్‌బుక్స్‌ అందజేశాం. త్వరలో బోధన సామగ్రిని పంపినీ చేస్తాం. భోజన ఖర్చులకు నిత్యం రూ.75 చెల్లిస్తున్నాం. హాజరు ప్రకారం విద్యార్థుల ఖాతాలో జమ చేస్తాం. గ్రూప్‌-2,3,4కు ప్రాథమిక కోర్సు బోధిస్తారు.


బాగా నేర్పిస్తున్నారు

లావణ్య, వికారాబాద్‌

మాది వికారాబాద్‌ పట్టణం శివరాంనగర్‌. ఎంబీఏ పూర్తి చేశా. గ్రూప్‌కు సిద్ధం అవుతున్నా. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నదే ఆశయం. గ్రూప్‌లో అన్ని పరీక్షలు రాయాలనుకున్నా. వివిధ అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని