logo

MMTS : మేడ్చల్‌-తెల్లాపూర్‌, మేడ్చల్‌- ఉందానగర్‌కు ఎంఎంటీఎస్‌ సర్వీసులు

నగరంలో ఎంఎంటీఎస్‌ రెండో దశ కూత పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. లక్షలాది ప్రజల సంవత్సరాల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది.

Updated : 01 Apr 2023 09:53 IST

ప్రధాని చేతుల మీదుగా రెండో దశ ప్రారంభానికి ద.మ రైల్వే ఏర్పాట్లు
ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో ఎంఎంటీఎస్‌ రెండో దశ కూత పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. లక్షలాది ప్రజల సంవత్సరాల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. నగరంలో ఏ మూల నుంచి అయినా మేడ్చల్‌ వెళ్లడం ఇక కష్టం కాదు.. అలాగే మేడ్చల్‌ నుంచి నగరంలో ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా వ్యయప్రయాసలుండవు. ఎంఎంటీఎస్‌ ఎక్కి 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం సైతం కేవలం రూ.10-15 టిక్కెట్‌తో ప్రయాణించవచ్చు. ఈ నెల 8న ప్రధానమంత్రి ఎంఎంటీఎస్‌ రెండోదశను లాంఛనంగా ప్రారంభించి మేడ్చల్‌-సికింద్రాబాద్‌-ఉందానగర్‌, మేడ్చల్‌-సికింద్రాబాద్‌-తెల్లాపూర్‌ ఎంఎంటీఎస్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సికింద్రాబాద్‌ డీఆర్‌ఎం ఏకే గుప్తా చెప్పారు.

తగ్గనున్న ప్రయాణ ప్రయాస..

మేడ్చల్‌-ఉందానగర్‌ 55 కిలోమీటర్ల దూరం ఉంది. మేడ్చల్‌ వైపు నుంచి వచ్చేవారు గతంలో సికింద్రాబాద్‌కు వచ్చి అక్కడి నుంచి ఎంఎంటీఎస్‌లో వెళ్తుండేవారు. మేడ్చల్‌ నుంచి లింగంపల్లికి 52 కిలోమీటర్ల ప్రయాణానికి రెండు, మూడు గంటలు పట్టేది. ఇప్పుడు ఎంఎంటీఎస్‌ రెండోదశలో భాగంగా ఎంఎంటీఎస్‌ రైళ్లు పరుగులు పెడితే కేవలం గంటలో ప్రశాంతంగా చేరుకోవచ్చు. మేడ్చల్‌-తెల్లాపూర్‌ మధ్య సికింద్రాబాద్‌ మీదుగా రైళ్లు నడిపించాల్సి ఉంది. అలాగే మేడ్చల్‌-ఉందానగర్‌ మధ్య సికింద్రాబాద్‌ మీదుగా కొనసాగాల్సి ఉంటుంది.  


త్వరలో అన్ని మార్గాల్లో..

ఏకే గుప్తా, సికింద్రాబాద్‌ డీఆర్‌ఎం

నగరంలో నలువైపులా అతితక్కువ ఖర్చుతో ప్రజారవాణా అందుబాటులోకి తీసుకురావాలన్నదే ద.మ రైల్వే లక్ష్యం. అందులో భాగంగా ప్రస్తుతం మేడ్చల్‌, ఉందానగర్‌, తెల్లాపూర్‌ వరకు ఎంఎంటీఎస్‌ సేవలు విస్తరిస్తున్నాం. త్వరలో మిగతా మార్గాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు