logo

సంక్షిప్త వార్తలు

ఈ నెల 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా విద్యాధికారిణి ఐ.విజయకుమారి తెలిపారు.

Updated : 01 Apr 2023 04:25 IST

‘పది పరీక్షల’ సందేహాల నివృత్తికి టోల్‌ ఫ్రీ నం.040-35659758

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా విద్యాధికారిణి విజయకుమారి

మేడ్చల్‌ కలెక్టరేట్‌: ఈ నెల 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా విద్యాధికారిణి ఐ.విజయకుమారి తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సహా వారి తల్లిదండ్రులకు సలహాలు అందించడం, సందేహాలను నివృత్తి చేసేలా చర్యలు చేపట్టామన్నారు. దీనిలోభాగంగా టోల్‌ ఫ్రీ నంబర్‌(040-35659758)ను అందుబాటులోకి తెచ్చామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.


ఎండలు మండే.. విద్యుత్తు వినియోగం పెరిగే

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ఎండల తీవ్రత పెరగడంతో విద్యుత్తు వినియోగం పెరుగుతోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలు దాటాయి. ఎండ దెబ్బకు ఏసీల వాడకం పెరగడంతో మార్చి 29న 67.5 మిలియన్‌ యూనిట్లకు వినియోగం పెరిగింది. విద్యుత్తు డిమాండ్‌ 3,250 మెగావాట్లకు చేరింది.


విమానాశ్రయంలో కరోనా పరీక్షలు ప్రారంభం

శంషాబాద్‌: విదేశాల్లో, దేశీయంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శంషాబాద్‌ విమానాశ్రయంలో కొవిడ్‌ పరీక్షలపై అధికారులు దృష్టి సారించారు. అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ప్రయాణించి శంషాబాద్‌లో దిగుతున్న ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తున్నారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 100 మంది అంతర్జాతీయ ప్రయాణికుల్లో అనుమానం ఉన్న ఇద్దరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామనివైద్యాధికారులు పేర్కొన్నారు. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్తున్న ప్రయాణికులకు కొవిడ్‌ పరీక్షలు, ధ్రువ పత్రాలు అవసరం లేదన్నారు.


శంకర్‌పల్లి సీఐపై బదిలీ వేటు

శంకర్‌పల్లి మున్సిపాలిటీ: శంకర్‌పల్లి సీఐగా విధులు నిర్వహించిన మహేష్‌గౌడ్‌పై సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర బదిలీ వేటు వేశారు. సివిల్‌ తగాదాల్లో తలదూర్చడం, అక్రమ కేసులు, ఇతరత్రా ఆరోపణలు రావడంతో శుక్రవారం మహేష్‌గౌడ్‌ను సీపీ కార్యాలయంలోని హెడ్‌ క్వార్టర్స్‌కి బదిలీ చేశారు. ఆయన స్థానంలో సీసీఎస్‌ మదాపూర్‌లో సీఐగా విధులు నిర్వహిస్తున్న ప్రసన్నకుమార్‌ని నియమించారు. వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరించారు.


వివాదాస్పద వ్యాఖ్యలపై ఫిర్యాదు

జహీరాబాద్‌ అర్బన్‌: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలో గురువారం జరిగిన శ్రీరామ నవమి శోభాయాత్రలో ఎంఐఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చీకోటి ప్రవీణ్‌పై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు శక్రవారం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పట్టణంలో హిందూ, ముస్లిం సోదరభావాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు ఆక్షేపించారు. ఫిర్యాదును స్వీకరించి సామాజిక మాధ్యమాలు, వీడియోలు పరిశీలిస్తున్నామని, తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఎస్సై శ్రీకాంత్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు అత్హర్‌ అహ్మద్‌, నాయకులు అజ్మత్‌పాష, మొహియుద్దీన్‌ ఘోరి, ఆమెర్‌బిన్‌ అబ్దుల్లా తదితరులు ఉన్నారు.


నేటి నుంచి హనుమాన్‌ జయంతి ర్యాలీలు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి 6వ తేదీ వరకు హనుమాన్‌ జయంతి ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ ప్రకటించాయి. ఇందుకు సంబంధించిన గోడపత్రికను శుక్రవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్‌రెడ్డి, భజరంగ్‌ దళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ శివరాములు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9600 ప్రాంతాల్లో ర్యాలీలు ఉంటాయన్నారు. 6న భాగ్యనగర్‌లోని గౌలీగూడ రామమందిర్‌ నుంచి సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్‌ హనుమాన్‌ మందిర్‌ వరకు 18 కిలోమీటర్ల మేర భారీ యాత్ర ఉంటుందని, ఇందులో భాగంగా కోఠి ఆంధ్రాబ్యాంక్‌ కూడలిలో లక్ష మందితో హనుమాన్‌ చాలీసా పారాయణం నిర్వహించి రికార్డు నెలకొల్పనున్నామన్నారు. కార్యక్రమానికి భజరంగ్‌దళ్‌ జాతీయ కన్వీనర్‌ నీరజ్‌ దునేరియా హాజరవుతారని వెల్లడించారు. పగుడాకుల బాలస్వామి, సుభాష్‌ చందర్‌ పాల్గొన్నారు.


హనుమజ్జయంతి ఉత్సవాలకు గట్టి భద్రత: సీపీ చౌహాన్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాబోయే హనుమజ్జయంతి ఉత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ ఆదేశించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం ఎల్బీనగర్‌ క్యాంప్‌ కార్యాలయంలో హనుమాన్‌ జయంతి ఉత్సవ కమిటీలు, పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతియుతంగా ఊరేగింపులు నిర్వహించాలని కమిటీ సభ్యులకు సూచించారు. సున్నిత ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి, హనుమాన్‌ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు శివరాం, శశిధర్‌ పాల్గొన్నారు.


తొలి పోరుకు సన్నద్ధం 

ఈనాడు, హైదరాబాద్‌: ఐపీఎల్‌ 16వ సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సన్నద్ధమవుతోంది. ఆదివారం రాజస్థాన్‌ రాయల్స్‌తో ఆ జట్టు తలపడనుంది. ఇప్పటికే ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ సాధన చేస్తోంది. తొలి మ్యాచ్‌కు సన్‌రైజర్స్‌కు భువనేశ్వర్‌ సారథ్యం వహించనున్నాడు. శుక్రవారం భువీ, కోచ్‌ లారా పిచ్‌ను పరిశీలించారు. 2019 తర్వాత నగరంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగనుండడంతో అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని