logo

రాత్రీపగలు వీధికుక్కలపై వల

వీధికుక్కలను పట్టుకునే కార్యక్రమాన్ని ప్రస్తుతం పగలు మాత్రమే చేపడుతున్నారని, 24 గంటలపాటు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీకి సూచించారు.

Updated : 02 Apr 2023 05:03 IST

సిబ్బంది, వాహనాలు, సంరక్షణ కేంద్రాలు పెంచాలి
శునకాల నియంత్రణకు   అఖిలపక్షం 26 సూచనలు

మేయర్‌కు మార్గదర్శకాలు అందజేస్తున్న అఖిలపక్ష కార్పొరేటర్లు

ఈనాడు, హైదరాబాద్‌: వీధికుక్కలను పట్టుకునే కార్యక్రమాన్ని ప్రస్తుతం పగలు మాత్రమే చేపడుతున్నారని, 24 గంటలపాటు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అఖిలపక్షం కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీకి సూచించారు. ఇటీవల అంబర్‌పేటలో కుక్కల దాడిలో ఓ చిన్నారి బలైన అనంతరం గ్రేటర్‌ కార్పొరేటర్లతో ఏర్పాటైన అఖిలపక్షం ఈ మేరకు 26 మార్గదర్శకాలను విడుదల చేసింది. నగరంలోని నాలుగు జంతు సంరక్షణ కేంద్రాలను పరిశీలించి, అధికారిక కార్యక్రమాలను అధ్యయనం చేసి పత్రికలు, వార్తా ఛానెళ్లు, ఇతరత్రా మాధ్యమాల్లోని కథనాలను బేరీజు వేసుకుని రెండేళ్లలో సమస్యను రూపుమాపేందుకు మార్గదర్శకాలను సిద్ధం చేసింది. వాటిని శనివారం మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మికి అందజేశామని భారాస, ఎంఐఎం, భాజపా, కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్లతో కూడిన అఖిల పక్షం ప్రకటించింది.

సూచనలు ఇలా..

* ప్రస్తుతం కుక్కలను పట్టుకునే వాహనాల్లోని సిబ్బంది మాత్రమే క్షేత్రస్థాయిలో జవాబుదారీగా ఉన్నారు. పారిశుద్ధ్య విభాగంలో మాదిరి.. క్షేత్రస్థాయిలో వీధి కుక్కల సమస్య నియంత్రణకు కనీసం రెండు డివిజన్లకు ఒకరు చొప్పున వెటర్నరీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను పొరుగు సేవల కింద నియమించుకోవాలి.

* జీహెచ్‌ఎంసీలో 30 సర్కిళ్లు ఉండగా, 31 మంది వెటర్నరీ అధికారులు బల్దియాలో పనిచేయాలి. కానీ 12 మందే ఉన్నారు. ప్రభుత్వం ఇప్పట్లో ఖాళీలను భర్తీ చేసేట్లు కనిపించట్లేదు. అందువల్ల పొరుగు సేవల కింద వైద్యులను నియమించుకోవాలి.

* శునకాలను పట్టుకునేందుకు ఇప్పుడున్న 50 వాహనాలకు మరో పదింటిని జోడించి, సర్కిల్‌కు రెండు వాహనాలను కేటాయించాలి.

* ఎన్జీవోలు, సంక్షేమ సంఘాలు, వాలంటీర్లు, జంతు ప్రేమికుల భాగస్వామ్యంతో ప్రజలకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా.. బల్దియా పట్టుకున్న కుక్కలను, శస్త్రచికిత్స పూర్తయ్యాక అదే ప్రాంతంలో వదలాల్సి ఉంటుందనే నిజాన్ని స్పష్టం చేయాలి. వేసవి వచ్చినందును ప్రతి కాలనీలో శునకాలకు తాగునీరు, ఆహారం కోసం గిన్నెలను సమకూర్చాలి.  

* శస్త్రచికిత్సల్లో ల్యాప్రోస్కోపిక్‌ పద్ధతిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి, ఫలితాల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకోవాలి.

* పీపుల్స్‌ ఫర్‌ యానిమల్స్‌(పీఎఫ్‌ఏ), బ్లూక్రాస్‌ సొసైటీ ఆఫ్‌ హైదరాబాద్‌ అనే స్వచ్ఛంద సంస్థలకు కేటాయించిన భూములను, సౌకర్యాలను జీహెచ్‌ఎంసీ ఉపయోగించుకోవాలి.

* ఆహార వ్యర్థాలను చెత్తకుప్పల్లో పడేసే హోటళ్లు, మాంసం దుకాణాలు, ఇతర వ్యాపార కేంద్రాలకు నోటీసులివ్వాలి. వీధులు పరిశుభ్రంగా ఉండేలా, చెత్తకుప్పలు ఏర్పాటవకుండా పారిశుద్ధ్య విభాగం చర్యలు తీసుకోవాలి.

* అక్రమ సంతానోత్పత్తి కేంద్రాలపై కఠిన చర్యలు, వీధికుక్కల దత్తత, స్థానికంగా కుక్కలను సంరక్షించే వ్యక్తులను ప్రోత్సహించాలి.  బాధితులకు భరోసా ఇచ్చేట్లు అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో రేబిస్‌, ఇతర టీకాలను అందుబాటులో ఉంచడం వంటి పలు మార్గదర్శకాలను అఖిల పక్షం సూచించింది.

* వీధి కుక్కల ప్రవర్తన, అవి ఎప్పుడు దాడి చేస్తాయి, దాడి నుంచి తప్పించుకోవడమెలా అనే అంశాలపై అవగాహన తెలిపే లఘు చిత్రాలను రూపొందించి థియేటర్లు, టీవీల్లో సినిమా ప్రసారమయ్యే ప్రదర్శించాలి.

* ప్రస్తుతం ఉన్న నాలుగు జంతు సంరక్షణ కేంద్రాలు సరిపోవు. చార్మినార్‌, శేరిలింగంపల్లి జోన్లలో కొత్త కేంద్రాలు అవసరం. ప్రస్తుతమున్న నాలుగు కేంద్రాల సామర్థ్యాన్ని రెండింతలకుపైగా పెంచాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని