logo

మారండి.. జీవితాన్ని మార్చుకోండి

పాత నేరస్థుల్లో పరివర్తన తీసుకొచ్చి సరికొత్త జీవితాన్ని ప్రారంభించేలా ‘మార్పు కోసం ముందడుగు’ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాచకొండ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు.

Published : 02 Apr 2023 03:19 IST

కార్యక్రమంలో మాట్లాడుతున్న రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌

ఈనాడు- హైదరాబాద్‌: పాత నేరస్థుల్లో పరివర్తన తీసుకొచ్చి సరికొత్త జీవితాన్ని ప్రారంభించేలా ‘మార్పు కోసం ముందడుగు’ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాచకొండ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు. కొందరు వ్యక్తులు తొందరపాటులో చేసిన నేరానికి.. వారి కుటుంబాలు సమాజంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయని అభిప్రాయపడ్డారు. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఉపాధి కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఎల్బీనగర్‌లో శనివారం ‘మార్పు కోసం ముందడుగు’ కార్యక్రమంలో కమిషనర్‌ పాల్గొన్నారు. ఎల్బీనగర్‌, మహేశ్వరం జోన్ల పరిధిలోని 400 మంది పాత నేరస్థులు, వారి కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో నేరాలు చేసినా.. మర్చిపోయి నవ జీవితాన్ని ప్రారంభించాలని, సమాజంలో హుందాగా ఉండాలని చెప్పారు. 

శిక్షణతో పాటు ఉపాధి..

రాచకొండ క్రైమ్స్‌ డీసీపీ పరావస్తు మధుకర్‌ స్వామి మాట్లాడుతూ..  నేరాలు మానితే డ్రైవింగ్‌, బ్యూటీపార్లర్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, మెకానిక్‌ ఇలా పలు అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధి కూడా చూపిస్తామని హామీ ఇచ్చారు. కుటుంబపరంగా ఏ సమస్య ఉన్నా నెల రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన పాత నేరస్థులతో తాము ఇకపై నేరమయ జీవితానికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఎల్బీనగర్‌ డీసీపీ సాయిశ్రీ, రాచకొండ క్రైం అదనపు డీసీపీ లక్ష్మి, ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌(గ్రీన్‌ల్యాండ్స్‌) ప్రతినిధులు ప్రొ.లక్ష్మి, ప్రొ.రాజ్‌కుమార్‌, ప్రాంతీయ ఛైర్మన్‌ రఘునాథ్‌రెడ్డి, వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఆకెళ్ల రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు