logo

రసాయనం.. నేల నిస్సారం

అధిక దిగుబడులు సాధించాలన్న తపనతో అన్నదాతలు ఎడాపెడా రసాయన ఎరువులను వినియోగిస్తున్నారు. పంట ఉత్పత్తులపై పురుగు మందులను పిచికారీ చేస్తున్నారు.

Updated : 02 Apr 2023 05:04 IST

రైతులకు అవగాహన కల్పిస్తే మేలు
న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

వరి చేనులో పురుగు మందు పిచికారీ చేస్తున్న రైతు

అధిక దిగుబడులు సాధించాలన్న తపనతో అన్నదాతలు ఎడాపెడా రసాయన ఎరువులను వినియోగిస్తున్నారు. పంట ఉత్పత్తులపై పురుగు మందులను పిచికారీ చేస్తున్నారు. ఇది మోతాదుకు మించడంతో తిండి గింజలు విషతుల్యంగా మారుతున్నాయి. నేల స్వభావానికి అనువుగా వాడాలన్న అవగాహన లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. ఇక భూసార పరీక్షలను వ్యవసాయ శాఖ గాలి కొదిలేసింది. సొంత అనుభవాలతో రసాయన ఎరువుల వాడకం జోరుగా సాగుతోంది. దీనివల్ల పెట్టుబడుల భారం పెరుగుతుండగా నేల సారం కోల్పోయేందుకు దారితీస్తోంది.

జిల్లాలో ఇరవై మండలాల్లోని 2.36లక్షల మంది రైతులు ఖరీఫ్‌ సీజన్‌లో 5.58 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. రబీలో 1.49 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. ఇవి దెబ్బతినకుండా ఉండేందుకు, అధిక ఉత్పత్తులు పొందేందుకు యూరియా, డీఏపీ, ఎమ్‌ఓపీ, ఎన్‌పీకేఎస్‌, ఎస్‌ఎస్‌పీలను వాడుతున్నారు. నేలల స్వభావాన్ని బట్టి వాడాల్సి ఉండగా, సొంత అనుభవాలు, దుకాణదారుల సూచనల మేరకు వినియోగిస్తున్నారు. దీంతో పెట్టుబడి ఖర్చులు రెట్టింపవుతున్నాయి. నేల సారం కోల్పోయి నాణ్యమైన దిగుబడులు పొందే వీల్లేకుండాపోయింది. అధిక మోతాదులో ఎరువులు, రసాయన మందులు వాడిన పంట ఉత్పత్తుల్ని వినియోగిస్తున్న ప్రజలు దీర్ఘకాల వ్యాధుల బారినపడి అనారోగ్యం పాలవుతున్నారు.

భూసార పరీక్షలతో కట్టడి

వ్యవసాయ అధికారులు భూసార పరీక్షలు చేసి ఫలితాల ఆధారంగా ఎరువులు, పురుగు మందులను వాడేలా రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంది. ఏటా వేసవిలో పొలాలకు వెళ్లి మట్టి నమూనాలు సేకరించి, పరీక్షలు చేశాక ఫలితాల కార్డులను రైతులకు పంపిణీ చేసేవారు. అయితే మూడేళ్లుగా ఈ ప్రక్రియ సాగడంలేదు. గతంలో వికారాబాద్‌, పరిగిలో ప్రయోగశాలలు ఉండటంతో ఫలితాల రాకకు నిరీక్షించాల్సి వచ్చేది. దీన్ని అధిగమించేందుకు సర్కారు వ్యవసాయ విస్తరణ అధికారులకు శిక్షణ ఇచ్చి భూసార పరీక్షల కిట్లను పంపిణీ చేసింది. వీటితో మండలాల్లోనే పరీక్షలు చేసే వెసులుబాటు కల్పించింది. ఏడాదిపాటు ఇది సజావుగా సాగింది. అనంతరం అటకెక్కింది.


ఉన్నతాధికారులు ఆదేశిస్తే చేయిస్తాం
- రుద్రమూర్తి, సహాయ సంచాలకులు, వ్యవసాయ శాఖ, తాండూరు.

ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేస్తే విస్తరణ అధికారులతో భూసార పరీక్షలు చేయిస్తాం. గతంలో పంపిణీ చేసిన కిట్లలో రసాయనాల గడువు తీరింది. మళ్లీ కొత్తగా సమకూర్చాల్సి ఉంటుంది. గతేడాది నియోజకవర్గంలోని చెన్నారంలో మాత్రమే పరీక్షలు చేశాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని