logo

ప్రత్యేక కార్యాచరణ.. జలసిరికి రక్షణ

తాండూరులో కాగ్నా నది వద్ద వరద ఒడిసిపట్టేందుకు ఆనకట్ట నిర్మించారు. ఇసుక అక్రమ రవాణాకు వీల్లేకపోవడంతో కొందరు అక్రమార్కులు ఆనకట్టకు గండికొట్టి నీటిని మళ్లించారు. అనంతరం యథేచ్ఛగా దందా కొనసాగించారు.

Published : 02 Apr 2023 03:19 IST

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

కాగ్నా నుంచి తరలించిన ఇసుక

తాండూరులో కాగ్నా నది వద్ద వరద ఒడిసిపట్టేందుకు ఆనకట్ట నిర్మించారు. ఇసుక అక్రమ రవాణాకు వీల్లేకపోవడంతో కొందరు అక్రమార్కులు ఆనకట్టకు గండికొట్టి నీటిని మళ్లించారు. అనంతరం యథేచ్ఛగా దందా కొనసాగించారు. స్థానికుల ఫిర్యాదులతో పోలీసులు రంగప్రవేశం చేసి గండిని పూడ్చివేసి ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేశారు.  

బషీరాబాద్‌ మండలంలో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీకొట్టడంతో ఆస్పత్రి  పాలయ్యారు.

తాండూరు మండలం గోనూరు కాగ్నా నదిలో అక్రమంగా ఇసుక రవాణా కొనసాగుతోంది. స్థానికులు చాలా సార్లు పోలీసులకు సమాచారం ఇచ్చి ట్రాక్టర్లను పట్టివేయించి కేసు నమోదు చేయించారు. అయినా దందా ఆగడం లేదు.

జిల్లాలో కాగ్నా నది పరీవాహకంలో ఇసుక అక్రమ రవాణా దర్జాగా సాగుతోంది. తాండూరు నియోజకవర్గంలోని తాండూరు మండలం గోనూరు, ఖాంజాపూర్‌, ఎల్మకన్నె, వీర్‌శెట్టిపల్లి, బిజ్వార్‌, బొంకూరుతో పాటు యాలాల, బషీరాబాద్‌ మండలాల గ్రామాలు, పట్టణంలోని కాగ్నా నది పరీవాహక ప్రాంతాల నుంచి ట్రాక్టర్లతో ఇసుక తరలించేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.5వేలకు విక్రయిస్తు రాత్రి, పగలూ తోడేస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు తరచూ కేసులు నమోదు చేస్తున్నప్పటికి రాజకీయ అండదండలతో మళ్లీ సాఫీగా సాగిపోతోంది. వీఆర్‌వోలను ఇతర శాఖలకు కేటాయించారన్న సాకుతో రెవెన్యూ అధికారులు ఈ వ్యవహారాన్ని పట్టించుకోవడం లేదు. ప్రజలు ఫిర్యాదు చేసినా సిబ్బంది కొరత ఉందంటూ దాటవేస్తున్నారు.

కలెక్టర్‌ చొరవతో..

ఈ దందాపై కలెక్టర్‌ నారాయణరెడ్డి దృష్టి సారించారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతోపాటు జిల్లా వాసులకు తక్కువ ధరకు అందించేలా నూతన విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గనులు భూగర్భ వనరుల శాఖ, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్‌ శాఖల ఆధ్వర్యంలో కాగ్నా నది పరీవాహక ప్రదేశాల్లో ఎంపిక చేసిన ప్రాంతం నుంచి ఇసుక సరఫరా చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. అవసరమైన వారు ఆన్‌లైన్‌లో రుసుం చెల్లిస్తే తరలించేలా నూతన విధానం అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయిస్తున్నారు. త్వరలో ఆయా శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఇసుక పాలసీని ప్రకటిస్తామని కలెక్టర్‌ ఎల్మకన్నెలో వెల్లడించారు.

తప్పనున్న ఆర్థికభారం

ఇసుక అవసరమైన వారు కరీంనగర్‌ నుంచి తెచ్చే లారీల్లో వద్ద కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు టన్నుకు రూ.1,600 నుంచి రూ.2వేలకు విక్రయిస్తున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు నిర్మాణాలు చేపట్టేందుకు జంకాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా కలెక్టర్‌ ఇసుక విధానాన్ని అమలులోకి తెస్తే, తక్కువ ధరకు పొందే వెసులుబాటు దక్కనుంది. పేదల సొంతింటి నిర్మాణ కల నెరవేర్చుకునే వీలుంటుంది. సర్కారు ఖజానాకు అదనంగా ఆదాయం సమకూరనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు