logo

సేవా కేంద్రం.. ఆర్థిక బలోపేతం

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(పీఏసీఎస్‌) కొత్త రూపును సంతరించుకోనున్నాయి. ఇన్నాళ్లూ మూస పద్ధతిలో రుణాలు ఇవ్వడం.. వాటిని తిరిగి రాబట్టడంలాంటి పనులే చేసేవి.

Published : 02 Apr 2023 03:19 IST

సహకార సంఘాలకు కొత్తరూపు
న్యూస్‌టుడే: వికారాబాద్‌

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(పీఏసీఎస్‌) కొత్త రూపును సంతరించుకోనున్నాయి. ఇన్నాళ్లూ మూస పద్ధతిలో రుణాలు ఇవ్వడం.. వాటిని తిరిగి రాబట్టడంలాంటి పనులే చేసేవి. ఈ క్రమంలో కొన్ని అప్పుల ఊబిలో కూరుకుపోగా,  మరికొన్ని లాభాలతోనూ సాగుతున్నాయి. ఇంకొన్ని మూతపడ్డాయి. ఇప్పుడు వాటి పరిస్థితి మారబోతోంది. పని తీరులో సంస్కరణలు చోటు చేసుకుంటాయి. మొదటి దశలో 8 సంఘాలు కొత్త వ్యాపారాలు చేపట్టేందుకు ముందుకు వచ్చాయి.

జిల్లాలో 22 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో రెండేసి బహుళార్థ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి. వికారాబాద్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ఈ మేరకు పంపిన ప్రతిపాదనలకు నాబార్డు ఆమోదం తెలిపింది. ఇక నిధుల విడుదలే తరువాయి. మొదటి దశ కింద కేంద్రాల ఏర్పాటుకు మొత్తం రూ.18 కోట్లు అవసరమవుతాయి. ఇందులో నాబార్డు 90 శాతం రుణంగా అంటే రూ.16.80 కోట్లను అందజేస్తుంది. మిగతా పది శాతం రూ.1.80 కోట్లను పీఏసీఎస్‌లు సమకూర్చుకుంటాయి. 22 పీఏసీఎస్‌లు మొత్తం 44 బహుళార్థ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తాయి. వీటిలో ఎక్కువ గోదాములు, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయశాలలున్నాయి. 1500, 1000, 500 మెట్రిక్‌ టన్నుల నిలువ సామర్థ్యం కలిగిన 22 గోదాములు, 12 అగ్రి ఔట్‌లెట్స్‌, రెండు సరకు రవాణా వాహనాలు, 2 హార్వెస్టర్లు, సమావేశ మందిరాలతో కూడిన 6 రైతు శిక్షణ కేంద్రాలు, 4 వేర్‌హౌస్‌లు, ఒక శీతల గిడ్డంగి వీటిలో ఉన్నాయి. ఈ సంఘాలు ఆదాయాన్ని సమకూర్చుకుని ఆర్థికంగా బలోపేతమవుతాయి. గ్యాస్‌ ఏజెన్సీలు, పెట్రోల్‌ బంకులు, సూపర్‌ బజార్లు, విత్తన విక్రయ కేంద్రాలు, వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటు చేసుకునేందుకు కూడా అవకాశం ఉంది. అయితే వీటికి తగిన స్థలం ఆ సొసైటీలకు ఉండాలి.

నిబంధనలు..

ఏ పీఏసీఎస్‌ అయినా బహుళార్థ సేవా కేంద్రాలుగా ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా అవి లాభాల బాటలో ఉన్న సంఘమై ఉండాలి. సొంత భవనం, సొంత స్థలం కలిగి ఉండాలి. వరుసగా మూడేళ్ల పాటు సంఘం ఎలాంటి ఒడిదొడుకులు, అప్పులు లేకుండా ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సంఘం పని తీరు ఉండాలి. దీనిని నాబార్డు బ్యాంకుల ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి రుణాలు మంజూరు చేస్తుంది.

నాబార్డు ఆర్థిక సాయం

పీఏసీఎస్‌ బహుళార్థ సేవాకేంద్రాల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని నాబార్డు సమకూరుస్తోంది. సహకార సంఘాలకు నేరుగా నాబార్డు రుణం ఇవ్వకుండా బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి అందిస్తోంది. ఇందులో వ్యవసాయ, రైతు శిక్షణ కేంద్రాల ఏర్పాటు, వ్యవసాయాధారిత గోదాములు, పరిశ్రమలకు 3 శాతం, ఇతర వ్యాపారాలకు 4 శాతం వడ్డీ చొప్పున రుణం ఇస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ద్వారా నిధులు సమకూరుస్తుంది. ఇలా 15 రకాల వ్యాపార సేవా కేంద్రాల ఏర్పాటుకు నాబార్డు రుణం మంజూరు చేస్తోంది. వ్యవసాయాధారిత పరిశ్రమలు, రైతు శిక్షణా కేంద్రాలు, రైతు గోదాముల ఏర్పాటు చేస్తే 25 శాతం రాయితీ లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని