logo

సంగీతంలో కిరాక్!

పుట్టింది హైదరాబాద్‌లో అయినా పెరిగిందంతా లండన్‌లోనే. మాతృభాషపై మమకారంతో తెలుగులో ఆల్బమ్స్‌ చేస్తూ అంతర్జాతీయ వేదికలపై అదరహో అన్పిస్తున్నారు సంగీతకారుడు శ్రీరామ్‌ అల్లూరి.

Published : 02 Apr 2023 03:19 IST

తెలుగు పాటలే రచనకు స్ఫూర్తి
‘ఈనాడు’తో రచయిత, సంగీతకారుడు శ్రీరామ్‌ అల్లూరి
- ఈనాడు, హైదరాబాద్‌

పుట్టింది హైదరాబాద్‌లో అయినా పెరిగిందంతా లండన్‌లోనే. మాతృభాషపై మమకారంతో తెలుగులో ఆల్బమ్స్‌ చేస్తూ అంతర్జాతీయ వేదికలపై అదరహో అన్పిస్తున్నారు సంగీతకారుడు శ్రీరామ్‌ అల్లూరి. సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పర్చుకొని కుర్రకారును తన గానంతో ఉర్రూతలూగిస్తున్నారు. రచ్చ గెలిచి ఇంటా గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. స్వదేశానికి వచ్చిన సందర్భంగా ‘ఈనాడు’ ఆయనతో ముచ్చటించింది. 

గిటార్‌ కొని.. సొంతంగా సాధన

ఐరోపాలో మాతృభాషలో పాడిన మొదటి రాక్‌ సంగీతకారుల్లో శ్రీరామ్‌ ఒకరు. ప్రపంచ రాక్‌ సంగీతంలో భారత్‌ను ప్రముఖంగా నిలపాలని తపిస్తున్న గాయకుడు, గేయ రచయిత ఆయన. శ్రీరామ్‌ తండ్రికి సంగీతంపై ఆసక్తి ఎక్కువ. దాంతో సహజంగానే శ్రీరామ్‌కి వయోలిన్‌, పియానో నేర్పించే ప్రయత్నం చేశారు. ఇంట్లో వేర్వేరు బ్యాండ్స్‌కు చెందిన ఆల్బమ్స్‌ వింటున్నప్పుడు తెలియకుండానే శ్రీరామ్‌లోనూ సంగీతంపై ఆసక్తి ఏర్పడింది. గిటార్‌ కొని సొంతంగా సాధన చేయడం మొదలెట్టారు. తెలుగు పాటలు వింటూ పెరిగారు. తన 13 ఏళ్ల వయసులో ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లారు. ఇంగ్లండ్‌, ఫిన్లాండ్‌లో చదువుకున్నారు. అక్కడ ఆంగ్లంలో పాఠాలు వింటున్నా.. మాతృభాషపై ఉన్న మక్కువతో తీరిక దొరికినప్పుడల్లా తెలుగులో పాటలు రాయడం మొదలెట్టారు. అనతికాలంలోనే స్వతంత్ర కళాకారుడిగా ఎదిగారు.

మొదటి ఆల్బమ్‌తోనే గుర్తింపు

శ్రీరామ్‌ 2016లో ‘ది మ్యాన్‌ ఆఫ్‌ ది ట్రూత్‌’ పేరుతో తొలి ఆల్బమ్‌ విడుదల చేశారు. దీనికి 4 స్టార్స్‌ వచ్చాయి. ఆల్బమ్‌లోని పాటలకు జనాదరణ లభించడంతో నాటింగ్‌ హోమ్‌, డెర్బీ, మిలన్‌ నుంచి పుణె, దిల్లీ, హైదరాబాద్‌లో లైవ్‌ ప్రదర్శనలు ఇచ్చేలా చేసింది. 2017లో యూకేలోని ప్రతిష్ఠాత్మక కేంబ్రిడ్జ్‌ ఫోక్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శనతో అరుదైన గౌరవం దక్కింది.

లైవ్‌ ప్రదర్శనలతో..

అల్లూరి లైవ్‌ సంగీత ప్రదర్శనలు ఇస్తూనే.. తన రెండో ఆల్బమ్‌ ‘ఓ కథ’ విడుదల చేశారు. సాధ్యమైనంత వరకు తెలుగులోనే పాటలు రాస్తున్నారు. ‘లైవ్‌ ప్రదర్శనల్లో సినిమా పాటలకు ఆదరణ బాగుంది. కానీ ఆల్బమ్స్‌పై అంతగా ఆసక్తి చూపించడం లేదు. వీటికి సైతం గుర్తింపు దక్కి సంగీత ప్రియులు వినేలా చేయడమే’ తన ముందున్న లక్ష్యం అంటారు శ్రీరామ్‌ అల్లూరి. యూకేలో ఎక్కువగా లైవ్‌ ప్రదర్శనలు ఇచ్చానని ఇక్కడ ఆ స్థాయికి రావడానికి మరికొంత సమయం పడుతుందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు