logo

గల్లీ గల్లీ... గంజాయి లొల్లి

అర్ధరాత్రి గల్లీలు, కాలనీరోడ్ల వెంట గుంపులుగా తిష్టవేస్తారు. గలాటా సృష్టిస్తుంటారు. అదేంటని అడిగితే చాలు.. ఎదురు తిరుగుతారు.. మారణాయుధాలతో దాడులకు తెగబడతారు.

Published : 02 Apr 2023 03:19 IST

నగరం నలుమూలలా విష సంస్కృతి

ఈనాడు - హైదరాబాద్‌: అర్ధరాత్రి గల్లీలు, కాలనీరోడ్ల వెంట గుంపులుగా తిష్టవేస్తారు. గలాటా సృష్టిస్తుంటారు. అదేంటని అడిగితే చాలు.. ఎదురు తిరుగుతారు.. మారణాయుధాలతో దాడులకు తెగబడతారు. గస్తీ పోలీసులు వస్తున్నా అదరరు, బెదరరు.! ఇదీ నగరంలో మత్తులో జోగుతున్న యువత మానసిక దుస్థితి.. మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.
అడ్డదారుల్లో సరఫరా.. నగరంలో గంజాయి వినియోగం ఇటీవల విపరీతంగా పెరిగింది. సరఫరా వ్యవస్థలు, స్మగ్లర్లను పోలీసులు కట్టడి చేస్తున్నారు.. అయినా, అడ్డదారిన సరకు నగరానికి చేరుతూనే ఉంది. శివారు ప్రాంతాల్లోని గల్లీలు, చిన్న దుకాణాల్లోనూ గుట్టుగా విక్రయాలు సాగుతూనే ఉన్నాయి.. విలాసాలకు దాసులయ్యే విద్యార్థులు సరకు కోసం స్వయంగా స్మగ్లర్ల అవతారం ఎత్తుతున్నారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులకు వెళ్లి గంజాయి తెచ్చుకుంటున్నారు.

గస్తీకి సుస్తీ... రాత్రిపూట పోలీసు పెట్రోలింగ్‌ తగ్గిపోవడం, ప్రధాన రహదారులపైనే ఎక్కువగా దృష్టి పెట్టడం వల్లే గంజాయి బ్యాచ్‌లు రెచ్చిపోతున్నాయని కాలనీ సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు. కాలనీలు, బస్తీల్లోకి గస్తీ వాహనాలు నామ్‌ కే వాస్తేగా వచ్చిపోతున్నాయని, ఇదే అదనుగా అల్లరిమూకలు చెలరేగుతున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రి నుంచి శివం దారిలో అర్ధరాత్రి కొందరు యువకులు తరచూ ఘర్షణ పడుతూ కనిపిస్తుంటారు. అయినా పెట్రోలింగ్‌ సిబ్బంది కనిపించని పరిస్థితి. నార్సింగి, రాజేంద్రనగర్‌, జవహర్‌నగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, బాలాపూర్‌, జీడిమెట్ల, గండిమైసమ్మ, చాంద్రాయణగుట్ట, గోల్కొండ, బహదూర్‌పుర, షేక్‌పేట, కాటేదాన్‌, ముషీరాబాద్‌, భోలక్‌పూర్‌ సహా కొన్ని ప్రాంతాల్లో ఈ దుస్థితి కొనసాగుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


పట్టుబడ్డ ఇంటర్మీడియట్‌ విద్యార్థి

స్వాధీనం చేసుకున్న గంజాయి, ద్విచక్ర వాహనం

దుండిగల్‌, న్యూస్‌టుడే: గంజాయి తరలిస్తున్న ఇంటర్మీడియట్‌ విద్యార్థితో పాటు పాత నేరస్థుడిని పోలీసులు అరెస్టు చేశారు. దుండిగల్‌ ఠాణాలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మేడ్చల్‌ ఏసీపీ వెంకట్‌ రెడ్డి, దుండిగల్‌ సీఐ రమణారెడ్డి, మేడ్చల్‌ ఎస్వోటీ  సీఐ జేమ్స్‌ వివరాలు వెల్లడించారు. మేడ్చల్‌ జిల్లా దేవరయాంజల్‌కు చెందిన మల్లోల్ల ఆనంద్‌(20) ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బిహార్‌లోని పట్నాకు చెందిన ధరమ్‌రాజ్‌(26) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి బొల్లారంలో ఉంటున్నాడు. ఇతనిపై గతంలో పటాన్‌చెరు ఠాణాలో గంజాయి సరఫరా కేసుంది. తన స్నేహితుల ద్వారా ఆనంద్‌కు ధరమ్‌రాజ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయించేవారు. ఏపీలోని పాడేరుకు చెందిన ద్వారా ధరమ్‌రాజ్‌ గంజాయి కొనుగోలు చేసి మార్చి 31న రైలులో సికింద్రాబాద్‌కు చేరుకున్నాడు. అనంతరం బస్సులో గండిమైసమ్మ చౌరస్తాకు వచ్చాడు. అప్పటికే ఆనంద్‌ అక్కడకు వచ్చి ఉన్నాడు. విశ్వసనీయ సమాచారంతో దుండిగల్‌, మేడ్చల్‌ ఎస్‌ఓటీ పోలీసులు ఇద్దరినీ అక్కడే అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో గంజాయి రవాణా గుట్టురట్టయింది. ఇద్దరితోపాటు పాటు గంజాయి విక్రయించిన సిద్ధు పైన కేసు నమోదైంది. సిద్ధు పరారీలో ఉన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని