logo

జూబ్లీహిల్స్‌ సొసైటీ జనరల్‌ బాడీ సమావేశాన్ని పర్యవేక్షించండి

జూబ్లీహిల్స్‌ సొసైటీ జనరల్‌బాడీ సమావేశ పర్యవేక్షణకు జిల్లా కోఆపరేటివ్‌ అధికారిని నియమించాలంటూ సహకార సంఘాల కమిషనర్‌కు శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Published : 02 Apr 2023 03:12 IST

జిల్లా కోఆపరేటివ్‌ అధికారికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ సొసైటీ జనరల్‌బాడీ సమావేశ పర్యవేక్షణకు జిల్లా కోఆపరేటివ్‌ అధికారిని నియమించాలంటూ సహకార సంఘాల కమిషనర్‌కు శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం జరిగే సమావేశానికి ఆయన వెళ్లి పర్యవేక్షించాలని, మొత్తం వీడియో చిత్రీకరించాలని, ఇందుకయ్యే ఖర్చును పిటిషనర్లు భరించాలని పేర్కొంది. సొసైటీ బైలాస్‌ను సవరిస్తూ మార్చి 9న జూబ్లీహిల్స్‌ సొసైటీ మేనేజింగ్‌ కమిటీ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ జంపాల శ్రీకాంత్‌ బాబు మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ బైలాస్‌ను సవరిస్తూ నోటీసు జారీచేయడం, దీనికి సంబంధించి ఏప్రిల్‌ 2న జరిగే జనరల్‌ బాడీ సమావేశంలో ఎలాంటి తీర్మానాలను ఆమోదించకుండా ఆదేశించాలని కోరారు. సమావేశం పర్యవేక్షణకు సహకార సంఘాల శాఖ నుంచి కాకుండా స్వతంత్ర వ్యక్తిని నియమించాలని కోరారు. కౌంటర్లు దాఖలు చేయడానికి సొసైటీ గడువు కోరడంతో న్యాయమూర్తి అనుమతిస్తూ విచారణను జూన్‌ 30వ తేదీకి వాయిదా వేశారు. జనరల్‌బాడీ సమావేశం పర్యవేక్షణకు జిల్లా కోఆపరేటివ్‌ అధికారి హాజరుకావాలని ఆదేశించారు. ప్రతివాదులైన సహకార సంఘాల శాఖ ముఖ్యకార్యదర్శి, సహకార సంఘాల కమిషనర్‌, జూబ్లీహిల్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ, మేనేజింగ్‌ కమిటీలకు నోటీసులు జారీ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని