logo

హైకోర్టులో రివ్యూ పిటిషన్‌కు అనుమతి

జూబ్లీహిల్స్‌ సొసైటీ గత పాలకవర్గానికి సంబంధించిన వ్యక్తులపై పెట్టిన క్రిమినల్‌ కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ (పునఃసమీక్ష) పిటిషన్‌ వేసుకోవడానికి ప్రస్తుత సొసైటీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌కు సుప్రీం కోర్టు అనుమతించింది.

Published : 02 Apr 2023 03:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ సొసైటీ గత పాలకవర్గానికి సంబంధించిన వ్యక్తులపై పెట్టిన క్రిమినల్‌ కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ (పునఃసమీక్ష) పిటిషన్‌ వేసుకోవడానికి ప్రస్తుత సొసైటీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌కు సుప్రీం కోర్టు అనుమతించింది. రవీంద్రనాథ్‌ నాంపల్లి క్రిమినల్‌ కోర్టులో దాఖలు చేసిన క్రిమినల్‌ ఫిర్యాదును సవాలు చేస్తూ అప్పటి సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. గత పాలకవర్గం సభ్యులపై సొసైటీ తరఫున క్రిమినల్‌ ఫిర్యాదు దాఖలు చేయడానికి రవీంద్రనాథ్‌కు అనుమతిలేదనే కారణంతో క్రిమినల్‌ కోర్టులోని కేసును హైకోర్టు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. దీన్ని సవాలు చేస్తూ అతను సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కృష్ణమురారి, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది వాదనలు వినిపిస్తూ సొసైటీ తరఫున ఫిర్యాదు చేయడానికి అనుమతి లేదనే కారణంతో అవాస్తవాలతో హైకోర్టు కేసు కొట్టివేయడం సరికాదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదన్నపుడు పరిష్కారానికి అక్కడే దరఖాస్తు వేసుకోవడానికి అవకాశం ఉందని పేర్కొంది. దీంతో పిటిషనర్‌ తరఫు న్యాయవాది హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయడానికి ఇక్కడ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతించాలని కోరారు. ఉపసంహరణకు అనుమతిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టులో రివ్యూ వేసుకోవడానికి అనుమతించింది. రివ్యూ పిటిషన్‌లో ఉత్తర్వులు వ్యతిరేకంగా ఉన్నాయని భావిస్తే తిరిగి ఇక్కడ పిటిషన్‌ వేసుకునే స్వేచ్ఛ ఉందంటూ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని