logo

Srinivas Goud: అలా చేసేవారిని గతంలో అరెస్టు చేశాం: శ్రీనివాస్‌గౌడ్‌

తెలంగాణలో జరిగే వేడుకల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం, లేబుల్స్‌ లేని మద్యం బాటిళ్లు కనిపిస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశంపై ఎక్సైజ్‌ శాఖ అధికారులు నిఘా పెట్టారని మంత్రి చెప్పారు.

Published : 17 May 2023 15:11 IST

హైదరాబాద్: తెలంగాణలో జరిగే వేడుకల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం, లేబుల్స్‌ లేని మద్యం బాటిళ్లు కనిపిస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశంపై ఎక్సైజ్‌ శాఖ అధికారులు నిఘా పెట్టారని మంత్రి చెప్పారు. గత వారం రోజుల వ్యవధిలో సోదాలు చేయగా.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1,330 ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గోవా, హరియాణా నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకొచ్చి తెలంగాణలో విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు.

‘‘ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి తెలంగాణలో అమ్మడం నేరం. అంతేకాదు.. అది కల్తీ మద్యం అయ్యేందుకు అవకాశం ఉంది. కొంతమంది సొంతంగా మద్యాన్ని తయారు చేసి లేబుల్స్ వేసి అమ్మకాల కొనసాగిస్తున్నారు. అలా చేసేవారిని గతంలో అరెస్టు చేశాం. డిపోల నుంచి సరఫరా చేసే మద్యం మాత్రమే సురక్షితమైనది. దానిని మాత్రమే కొనుగోలు చేయాలి. కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి కంటైనర్ల ద్వారా అక్రమంగా తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఎవరైనా విదేశాల నుంచి రాష్ట్రానికి వస్తే వారి వెంట కేవలం రెండు బాటిల్స్ మాత్రమే తీసుకురావడానికి అవకాశం ఉంటుంది’’ అని శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని