logo

సరిపోరు.. సమస్యలు పట్టవు

జిల్లాలో రేషన్‌ డీలర్ల పోస్టులు భర్తీకాక పోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ గ్రామానికి ప్రత్యేకంగా డీలర్‌ను నియమించాలని ప్రజలు ఏళ్లుగా కోరుతున్నా ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని పలుచోట్ల వాపోతున్నారు.

Published : 26 May 2023 02:51 IST

డీలర్ల కొరతతో పంపిణీకి వెత
న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌ మున్సిపాలిటీ, తాండూరు

రేషన్‌ దుకాణం వద్ద వేచిచూస్తున్న వినియోగదారులు

జిల్లాలో రేషన్‌ డీలర్ల పోస్టులు భర్తీకాక పోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ గ్రామానికి ప్రత్యేకంగా డీలర్‌ను నియమించాలని ప్రజలు ఏళ్లుగా కోరుతున్నా ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని పలుచోట్ల వాపోతున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

59 పోస్టులు ఖాళీ: ఆయా మండలాల్లో 59 గ్రామాల్లో రేషన్‌ డీలరు పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఈవిషయంలో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పలు చోట్ల పదేళ్లకు పైబడి ఇంఛార్జిలుగా వ్యవహరిస్తున్నారు. తమవల్ల కాదని చెబుతున్నా అధికారులు ఉన్నవారిపై ఒత్తిడి తీసుకువచ్చి నెట్టుకొస్తున్నారనే ఆరోపణలున్నాయి.  

* అధికారులు పక్క గ్రామాల డీలర్లకు అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నారు. దీంతో కొందరు వారంలో 3 లేదా 4 రోజులు మాత్రమే తీస్తున్నారు. అనుబంధ గ్రామాల ప్రజలు పలుచోట్ల వాగులు దాటి సరకులు తీసుకుందామని వెళ్తే  దుకాణం తెరవ పోవడంతో ఉసూరుమంటూ వెనుదిరగాల్సి వస్తోంది. పూర్తిస్థాయిలో డీలర్లను నియమించి సొంత గ్రామంలోనే సరఫరా చేస్తే తమకు సౌకర్యంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.  

క్వింటాలుకు కమీషన్‌ కేవలం 70 పైసలు రేషన్‌ దుకాణాల ద్వారా గతంలో బియ్యంతో పాటు కందిపప్పు, మంచినూనె, ఉప్పు, కారంపొడి, పసుపు, గోధుమపిండి, చింతపండు వంటి తొమ్మిది రకాల సరకులు సరఫరా జరిగేది. రానురాను అవన్నీ తగ్గి కేవలం బియ్యంతో సరిపెడుతున్నారు. ఈ కారణంగా డీలర్లకు వచ్చే కమీషన్‌ భారీగా తగ్గిపోయింది. ప్రస్తుతం క్వింటాలు బియ్యానికి 70పైసలు మాత్రమే అందజేస్తోంది. ఇదేమాత్రం సరిపోవడంలేదని డీలర్లు వాపోతున్నారు. ఉదాహరణకు ఒక గ్రామంలో పది క్వింటాళ్ల బియ్యం కోటా ఉంటే రూ.7వేలు అందుతాయి. రవాణా ఛార్జీలు, హమాలీ పోను తమకేమీ గిట్టుబాటు కావడం లేదని డీలర్లు పేర్కొంటున్నారు. దీంతో ఇంఛార్జి గ్రామాలపై విముఖం వ్యక్తం చేస్తున్నారు.

* మొత్తం చౌకధరల దుకాణాలు.. 588

* తెల్ల రేషన్‌ కార్డులు.. 2,14,530

* అంత్యోదయ.. 26,698

* అన్నపూర్ణ    కార్డులు.. 36

* నెలకు బియ్యం పంపిణీ.. 50000 క్వింటాళ్లు


త్వరలో భర్తీ చేస్తాం
- రాజేశ్వర్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి

ఖాళీగా ఉన్న డీలరు పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈక్రమంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. రెండు మూడు నెలల్లోనే భర్తీ అయ్యే అవకాశం ఉంది. సరకుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సమీప గ్రామాలకు చెందిన డీలర్లకు అదనపు బాధ్యతలను అప్పగించాం.


ప్రమాద బీమా వర్తింపజేయాలి
జూకారెడ్డి, జిల్లా, రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు

దాదాపు ఎనిమిదేళ్లుగా అనేక ఇబ్బందులతో సరకులు పంపిణీ చేస్తున్నాం. కరోనా సమయంలో పలువురు డీలర్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఎలాంటి షరతులు లేకుండా బాధిత కుటుంబాలకు  డీలరు షిప్పును కేటాయించాలి. ఇదే సమయంలో ప్రభుత్వం రూ.10లక్షల ప్రమాద బీమా వర్తింపజేయాలి. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం, ఉద్యోగులుగా గుర్తించడం, కమీషన్‌ పెంచి ఆదుకోవడం వంటి చర్యలు చేపట్టి అండగా నిలవాలి.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు