logo

ఆలయంలో చోరీ.. పాత నిందితుడి అరెస్టు

ఆగాపురా కట్టమైసమ్మ ఆలయంలో గురువారం ఉదయం చోరీ జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి గంట వ్యవధిలోనే చోరీకి పాల్పడిన పాత నిందితుడిని అరెస్టు చేశారు.

Published : 26 May 2023 02:43 IST

మెహిదీపట్నం, న్యూస్‌టుడే: ఆగాపురా కట్టమైసమ్మ ఆలయంలో గురువారం ఉదయం చోరీ జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి గంట వ్యవధిలోనే చోరీకి పాల్పడిన పాత నిందితుడిని అరెస్టు చేశారు. హబీబ్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీరాం సైదబాబు, ఆలయ కమిటీ కార్యదర్శి అర్జున్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి పూజల తర్వాత అర్చకుడు గుడికి తాళం వేసి వెళ్లిపోయారు. ఆలయ ముఖద్వారంపై అమ్మవారి విగ్రహం ధ్వంసమై ఉండడాన్ని గురువారం ఉదయం 6 గంటల సమయంలో స్థానికులు గుర్తించి, ఆలయ కమిటీ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి చోరీకి పాల్పడిన వ్యక్తి పాత నేరస్థుడు వికారాబాద్‌ జిల్లా, పెద్దేముల్‌ మండలం, ఉమ్లానాయక్‌ తండాకు చెందిన సునీల్‌ చౌహాన్‌ (35)గా గుర్తించారు. అతను పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా నాంపల్లి రైల్వేస్టేషన్‌లో అరెస్టు చేశారు. రూ.36,650 నగదు, ఏడు తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. గంటలోపే కేసును ఛేదించిన ఎస్సైలు అలీం, రామారావు, ఏఎస్సై రామాంజనేయులు, హెడ్‌కానిస్టేబుల్‌ రాముడు, కానిస్టేబుళ్లు ప్రశాంత్‌, డి.శ్రీకాంత్‌, బి.వీరాస్వామిని ఇన్‌స్పెక్టర్‌ అభినందించారు.

హుండీ, పగులగొట్టేందుకు ఉపయోగించిన రాడ్‌, పైపు

వారం రోజులుగా సంచారం

సునీల్‌ చౌహాన్‌ గతంలో కూకట్‌పల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలోని రెండు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డాడు. వారం రోజులుగా హబీబ్‌నగర్‌, నాంపల్లి ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు తెలిసింది. మంగళవారం రాత్రి కోమటికుంట కాంపౌండ్‌ సమీపంలోని కనకదుర్గా ఆలయంలోకి చొరబడి రూ.3వేలు చోరీ చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజుల క్రితం మల్లేపల్లిలోని ఓ ప్రార్థనా స్థలంలో కూడా హుండీ చోరీ చేశాడు. గురువారం ఉదయం కట్టమైసమ్మ ఆలయ ముఖద్వారం పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభం సహాయంతో ఆలయం ప్రహరీ ఎక్కాడు. ముఖద్వారంపై ఉన్న అమ్మవారి విగ్రహం ధ్వంసమైంది. ఆలయం ఆవరణలోకి ప్రవేశించి, మంచినీటి ట్యాంకు పైపు సహాయంతో ప్రధాన ఆలయం గ్రిల్స్‌ తాళాలు పగులగొట్టాడు. అక్కడే ఉన్న హుండీని ధ్వంసం చేసి నగదుతోపాటు కానుకలతో పరారయ్యాడు. గర్భగుడిలోని అమ్మవారి చేతిలోని త్రిశూలం చోరీకి విఫలయత్నం చేశాడు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని