logo

మహిళను ముక్కలు చేసిన కేసులో నిందితుడికి రిమాండ్‌

ఏళ్లుగా సహజీవనం కొనసాగిస్తున్న ఆ మహిళ మరో పెళ్లికి సిద్ధమైంది. అప్పుగా ఇచ్చిన రూ.7 లక్షలు తిరిగివ్వాలని ఒత్తిడి చేసింది. అవివాహితుడైన నిందితుడు డబ్బు చెల్లించాల్సి రావడంతోపాటు ఆమె ఎడబాటు నిర్ణయాన్ని తట్టుకోలేక విచక్షణారహితంగా 12సార్లు ఆమెపై కత్తితో దాడిచేసి..

Published : 26 May 2023 02:51 IST

సైదాబాద్‌, చైతన్యపురి, న్యూస్‌టుడే: ఏళ్లుగా సహజీవనం కొనసాగిస్తున్న ఆ మహిళ మరో పెళ్లికి సిద్ధమైంది. అప్పుగా ఇచ్చిన రూ.7 లక్షలు తిరిగివ్వాలని ఒత్తిడి చేసింది. అవివాహితుడైన నిందితుడు డబ్బు చెల్లించాల్సి రావడంతోపాటు ఆమె ఎడబాటు నిర్ణయాన్ని తట్టుకోలేక విచక్షణారహితంగా 12సార్లు ఆమెపై కత్తితో దాడిచేసి.. తలను మొండెం నుంచి వేరుచేశాడని తెలిసింది. తనతో సహజీవనం చేసే మహిళను అతి కిరాతకంగా హతమార్చిన బి.చంద్రమోహన్‌(48)కు గురువారం న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల ద్వారా పలు అంశాలు తెలిశాయి. తండ్రి అనారోగ్యం పాలవడంతో.. ఓ ప్రైవేటుఆసుపత్రిలో హెడ్‌నర్స్‌ ఎర్రం అనురాధరెడ్డి(55)ని హౌజ్‌నర్స్‌గా చంద్రమోహన్‌ ఏర్పాటు చేశాడు. పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది. తండ్రి మరణాంతరం ఇంట్లోని కింది భాగంలో ఒక పోర్షన్‌లో ఆమె అద్దెకు దిగారు. తరచూ ఆమెవద్ద అప్పులు చేశాడు. హైదరాబాద్‌కు వచ్చే ముందు అనురాధరెడ్డి తిరుపతిలో నివసించారు. తమిళంలో పట్టు ఉండటంతో ఆమె ఇటీవల పెళ్లి సంబంధం కోసం తమిళ మాట్రిమోనిలో ప్రయత్నాలు చేశారు. ఓ సంబంధం కుదరడంతో తనవద్ద తీసుకున్న అప్పు తిరిగివ్వాలని పట్టుబట్టింది. ఆమె దూరమవుతుండనే ఆక్రోశం అతడిలో నెలకొంది. ఈ నెల 12న ఇరువురు గొడవ పడ్డారు. వంటగదిలో ఉన్న కత్తితో పొడిచేందుకు ప్రయత్నించగా ఆమె పెనుగులాడటంతో చంద్రమోహన్‌ చేతులకు స్వల్పంగా కత్తిగాట్లు పడ్డాయి. అనంతరం నిందితుడు విచక్షణారహితంగా ఆమెను హత్య చేశాడు.  మూడు రోజులు ఇంట్లోనే శవం పెట్టుకుని ఎదురు చూశాడు. పక్క పోర్షన్‌లో ఉండే వారు గ్రామానికి వెళ్లడంతో ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. శవం నుంచి దుర్గంధం రాకుండా పలు రకాల రసాయనాలు తెచ్చి వాడాడు. యూట్యూబ్‌ వీక్షిస్తూ రెండు స్టోన్‌ కట్టర్లతో శరీరాన్ని ఆరు భాగాలుగా కోశాడు. 15న తల మూసీప్రాంతం తీగలగూడ వద్ద పారేయడం, 17న చెలరేగిన కలకలంతో మిగతా భాగాలు ఫ్రిజ్‌, సూట్‌కేసులో దాచి ఉంచాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు చిక్కడంతో కేసును తదుపరి దర్యాప్తు కోసం చైతన్యపురి ఠాణాకు బదిలీ చేస్తున్నట్లు సౌత్‌ఈస్ట్‌ జోన్‌ డీసీపీ రూపేష్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని