logo

సికింద్రాబాద్‌ పరిధిలో 4 నెలల్లో 520 మంది మృత్యువాత

మల్కాజిగిరికి చెందిన తండ్రికి వయోభారం. మూడు పదులు దాటినా అనారోగ్యంతో బాధపడే కూతురు. కుటుంబానికి భారంగా భావించి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

Updated : 26 May 2023 05:52 IST

ఈనాడు, హైదరాబాద్‌, రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: మల్కాజిగిరికి చెందిన తండ్రికి వయోభారం. మూడు పదులు దాటినా అనారోగ్యంతో బాధపడే కూతురు. కుటుంబానికి భారంగా భావించి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. భరత్‌నగర్‌లోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన మనుమరాలు, ఫోన్‌ మాట్లాడుతూ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మరణించింది. ఇలా రోజూ రైలుపట్టాలపై చిమ్ముతున్న నెత్తుటిధారలు ఆందోళన కల్గిస్తున్నాయి. సికింద్రాబాద్‌ రైల్వే పోలీసు జిల్లా పరిధిలో 4నెలల్లో 520 మంది మరణించారు.

అంచనా వేయలేక తికమక

దేశం నలువైపులా నుంచి నగరానికి వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. పట్టాలకు ఇరువైపులా కాలనీల్లో జనం నివసిస్తున్నారు.  జనావాసాలకు సమీపంలోని రైల్వేస్టేషన్లు, లైన్లకు ఇరువైపులా రక్షణ గోడలు/ఫెన్సింగ్‌ సరిగా లేవు. ఒకవేళ ఉన్నా మధ్యలో కాస్త ఖాళీ దొరికితే పట్టాలు దాటుతున్నారు. భరత్‌నగర్‌, ఖైత్లాపూర్‌, చందానగర్‌ ప్రాంతాల్లో జరిగే ప్రమాదాలకు 80 శాతం ఏమరపాటే కారణమని దర్యాప్తులో తేలుతుంది. సాధారణ రైళ్ల కంటే ఎంఎంటీఎస్‌ వెడల్పు ఎక్కువ. మలుపుల వద్ద ఉన్న వారికి అవగాహన లేక రైలు ఢీకొని చనిపోతున్నారు.

అనుమానాస్పదంగా..

కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర బంధాలు, తదితర కారణాలతో మరణమే మార్గం అనుకునేవారు మృత్యువును ఆశ్రయించేందుకు రైలు పట్టాలను ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ వరకూ 213 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. 5-6 మంది రైలు పట్టాల సమీపంలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇటువంటి మృతదేహాల ఆనవాళ్లను గుర్తించటం.. మృతికి కారణాలను వెలికితీయటం రైల్వే పోలీసులకు సవాల్‌గా మారుతోంది. యూపీ, బిహార్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన నేరస్థులు, రౌడీషీటర్లు ప్రత్యర్థులను హతమార్చి రైళ్లలో తీసుకొస్తూ.. నిర్మానుష్య ప్రాంతానికి రాగానే మృతదేహాలను పడేస్తుంటారు. ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు కొన్నిసార్లు పట్టాల మీదే వదిలేస్తారు. మృతదేహాలపై రైళ్లు తిరగటంతో మాంసంముద్దలుగా మారుతుంటాయి.

సెల్ఫీలు.. రీల్స్‌తో..

రైళ్లలో ప్రయాణిస్తూ కిటికీల వద్ద కూర్చొని, వేగంగా వెళ్తున్న సమయంలో సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదమని తెలిసినా సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు కోసం సాహసకృత్యాలు చేస్తున్నారు. ఇటీవల లాలాగూడ వద్ద ముగ్గురు మైనర్లు రైల్వే విద్యుత్‌ తీగల కారణంగా ప్రమాదం బారినపడ్డారు. విద్యానగర్‌లో రీల్స్‌ తీసే క్రమంలో రైలు ఢీకొని యువకుడు గాయాలపాలయ్యాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు