logo

సైబర్‌ ఆగడాలకు విశ్వవిద్యాలయాల చెక్‌

చరవాణులు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను వినియోగిస్తున్న వ్యక్తులు.. సంస్థల డేటాను దొంగిలించి సొమ్ము చేసుకుంటున్న సైబర్‌ నేరస్థుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్‌ సీఆర్‌రావు ఎఐఎంఎస్‌సీఎస్‌లో పరిశోధనలు కొనసాగుతున్నాయి.

Updated : 26 May 2023 06:04 IST

వెబ్‌సైట్‌ల  బ్రౌజింగ్‌... హ్యాకింగ్‌లపై క్షణాల్లో సమాచారం

ఈనాడు, హైదరాబాద్‌: చరవాణులు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను వినియోగిస్తున్న వ్యక్తులు.. సంస్థల డేటాను దొంగిలించి సొమ్ము చేసుకుంటున్న సైబర్‌ నేరస్థుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్‌ సీఆర్‌రావు ఎఐఎంఎస్‌సీఎస్‌లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలపై సైబర్‌ నేరస్థులు దాడులకు పాల్పడడం సున్నితమైన సమాచారాన్ని హ్యాక్‌చేయడం వంటి ఘటనల నేపథ్యంలో మూడు, నాలుగేళ్ల నుంచి విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. అపరిచిత వ్యక్తులు వెబ్‌సైట్‌ను బ్రౌజ్‌ చేసినా హ్యాకింగ్‌కు ప్రయత్నించినా క్షణాల్లో ప్రధాన సర్వర్లకు సమాచారం వచ్చేలా ఆచార్యులు, పరిశోధకులు భద్రత వ్యవస్థను రూపొందించారు. కొన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లలో ఈ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ పరిశోధనలు సంతృప్తికరంగా వచ్చాయని డేటా చౌర్యం.. సైబర్‌ భద్రతపై మరిన్ని పరిశోధనలు నిర్వహించి వాటి ఫలితాల ఆధారంగా పటిష్ఠ వ్యవస్థను రూపొందించనున్నామని పరిశోధక బృందం ఆచార్యులు వివరించారు.

అనుమానాస్పదం.. వెంటనే గుర్తింపు

కేంద్ర, రాష్ట్రాల అధికారిక వెబ్‌సైట్లు ప్రభుత్వరంగ సంస్థల పోర్టళ్లలోకి సైబర్‌ నేరస్థులు ప్రవేశించి సమాచారాన్ని సంగ్రహించి సొంత ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారు. రాన్సమ్‌వేర్‌లతో దాడులకు పాల్పడుతూ బిట్‌కాయిన్‌లు చెల్లించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. బ్యాంకింగ్‌ ఫార్మా పరిశ్రమల్లో డేటా చౌర్యం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఐఐబీ(ఇన్స్యూరెన్స్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో) సర్వర్లలోకి సైబర్‌ నేరస్థులు ప్రవేశించారు. సైబర్‌నిపుణులతో దిద్దుబాటు చర్యలు చేపట్టారు. వీటిని నియంత్రించేందుకే ఉస్మానియా, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. కొత్త సాఫ్ట్‌వేర్‌ల రూపకల్పన జరుగుతోంది. కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని సీఆర్‌రావు పరిశోధన కేంద్రం కేంద్ర ప్రభుత్వంలోని కీలక విభాగాలకు సైబర్‌ భద్రత సేవలు అందిస్తుండగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సెంటర్‌ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీ విభాగం రాష్ట్ర పోలీస్‌శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని సైబర్‌ నేరాలను వేగంగా గుర్తించేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అందిస్తోంది. నేరాల తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎక్కడ లోపాలున్నాయి? సైబర్‌ నేరస్థులు ఏ తరహాలో భద్రత వ్యవస్థల్లోకి ప్రవేశిస్తున్నారు? అన్న అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు.


బహుళజాతి సంస్థలు.. ఐటీరంగాలకూ సేవలు

సైబర్‌భద్రతపై బహుళజాతి సంస్థలు, ఐటీ కంపెనీలకు విశ్వవిద్యాలయ పరిశోధన విభాగాలు సేవలందిస్తున్నాయి. ఆయా సంస్థలు, కంపెనీల రహస్య సమాచారాన్ని సైబర్‌ నేరస్థులు దొంగిలించకుండా ఆరు నుంచి ఏడు అంచెల భద్రతా వ్యవస్థను పరిశోధకులు అందిస్తున్నారు. కొన్ని కంపెనీలు, సంస్థల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. విధులు పూర్తయ్యాక ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఇళ్లకు వెళ్లేప్పుడు భద్రతా ప్రొటోకాల్‌ను మర్చిపోతే వెంటనే అప్రమత్తం చేసే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. సాధారణ పరిభాషలో చెప్పాలంటే ఆఫీస్‌ పనిపూర్తయ్యాక లైట్లు ఆర్పేయకుండా ఇంటికి వెళ్లడం వంటిది. ఒకే లైట్‌ కదా అనుకుంటే దానికారణంగా విద్యుదాఘాతం జరిగే ప్రమాదముంది. పొరపాటున ఎవరైనా భద్రతా ప్రొటోకాల్‌ మర్చిపోయినా సాఫ్ట్‌వేర్‌ సరిచేస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని