logo

కాబోయే భార్యను కాపాడబోయి.. నీట మునిగి యువకుడి మృతి

మరో నాలుగు నెలల్లో పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో ఓ కుటుంబం శామీర్‌పేట పెద్ద చెరువుకు వచ్చింది. కాబోయే కోడలితో ఉత్సాహంగా గడుపుతున్న కుటుంబీకులకు ఆ సంతోషం కొద్ది సేపట్లోనే దూరమైంది.

Updated : 26 May 2023 05:50 IST

శామీర్‌పేట పెద్ద చెరువులో దుర్ఘటన

అమీర్‌ఖాన్‌

శామీర్‌పేట, న్యూస్‌టుడే: మరో నాలుగు నెలల్లో పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో ఓ కుటుంబం శామీర్‌పేట పెద్ద చెరువుకు వచ్చింది. కాబోయే కోడలితో ఉత్సాహంగా గడుపుతున్న కుటుంబీకులకు ఆ సంతోషం కొద్ది సేపట్లోనే దూరమైంది. తమ ఇంటి కోడలు కాబోయే అమ్మాయి చెరువులో పడిపోగా.. కాపాడబోయిన పెళ్లి కొడుకు మృత్యువాత పడిన హృదయవిదారకమైన సంఘటన గురువారం శామీర్‌పేట ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు, బంధువుల కథనం ప్రకారం .. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని చిలకలగూడ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అమీర్‌ఖాన్‌(22) తన తల్లి కాజాబీ, ఇద్దరు అక్క చెల్లెళ్లు, కాబోయే భార్యతో కలిసి మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట పెద్ద చెరువు పర్యాటక కేంద్రానికి వచ్చారు. వీరంతా చెరువు కుడి వైపు బంగారు తెలంగాణ బోర్డు  ఉన్న ప్రాంతానికి వెళ్లారు. కాబోయే భర్తతో మాట్లాడుతూ చెరువు కట్ట అంచుకు వెళ్లిన అమ్మాయి ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయింది. పక్కనే ఉన్న అమీర్‌ఖాన్‌ కాపాండేదుకు నీటిలోకి దిగాడు. కుటుంబసభ్యులు చున్నీ వేసి బయటకు లాగటంతో ఆ యువతి ప్రాణాలతో బయటపడింది. అమీర్‌ నీటిలో గల్లంతయ్యారు. అప్పటి వరకు ఆనందంగా గడిపిన ఆ కుటుంబ సభ్యుల రోదన పలువురిని కంట తడిపెట్టించింది.

చెరువులో వెతుకుతున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు

మూడున్నర గంటల  గాలింపు.. మూడున్నర గంటల అనంతరం  అమీర్‌ఖాన్‌ మృతదేహం లభ్యమైంది. ఈ కుటుంబం కౌకూరులోని ఎంబీ దర్గాకు వెళ్దామని ఇంటి నుంచి బయలుదేరారు. ముందు శామీర్‌పేట చెరువు చూద్దామని రావటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. నేరుగా దర్గాకు వెళ్లినా కుమారుడి ప్రాణం దక్కేదంటూ తల్లి రోదించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని