logo

అధికార నేత.. అధికారులకు వాత

శంషాబాద్‌ మండలం మదనపల్లిలో 559 ఎకరాల అసైన్డు భూముల దురాక్రమణ వెనుక రాష్ట్రానికి చెందిన కీలక నేత ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది.

Updated : 26 May 2023 05:50 IST

సర్కారు భూముల అన్యాక్రాంతంపై చర్యలకు వెనకడుగు
మదనపల్లిలో రూ.వేల కోట్ల భూముల వ్యవహారం

భూములను చదును చేస్తున్న వైనం

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, న్యూస్‌టుడే, శంషాబాద్‌: శంషాబాద్‌ మండలం మదనపల్లిలో 559 ఎకరాల అసైన్డు భూముల దురాక్రమణ వెనుక రాష్ట్రానికి చెందిన కీలక నేత ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీనివల్లే ఇక్కడ రూ.5 వేల కోట్ల విలువైన 350 ఎకరాల సర్కారు  భూమి చేతులు మారినా అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. ఈనెల 19న ‘అసైన్డ్‌ భూముల్లో అక్రమాల జాతర’ శీర్షికన ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనం విషయంలో కీలకంగా వ్యహరించాల్సిన శంషాబాద్‌ తహసీల్దార్‌ శ్రీనివాసరెడ్డి తనకు సంబంధం లేనట్లుగానే వ్యవహరించడం దీనికి బలం చేకూరుస్తోంది. రైతులు పెద్దఎత్తున ఆందోళన చేయడంతో ఆయన గురువారం నామమాత్రంగా సదరు అసైన్డు భూములను పరిశీలించి వచ్చారు. ఈ భూముల విషయంలో అధికారులు తల దూర్చవద్దని కీలక నాయకుడు హెచ్చరించినట్లు తెలిసింది. దీంతోనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హరీష్‌గానీ పోలీసు ఉన్నతాధికారులుగానీ స్పందించడం లేదని చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌ మండలం మదనపల్లి గ్రామ పరిధిలో 559 ఎకరాల అసైన్డ్‌ భూములు పెద్దఎత్తున చేతులు మారిన విషయాన్ని కొద్దిరోజుల కిందట ‘ఈనాడు’ వెలుగులోకి తేవడం సంచలనంగా మారింది. దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన 350 ఎకరాల భూమి రైతుల నుంచి కొంతమంది నాయకులు, రియల్టర్లు స్వాధీనం చేసుకున్నారు. కొంతమొత్తం రైతులకు ఇచ్చి నిబంధనలకు విరుద్ధంగా కొన్ని భూములను రిజిస్ట్రేషన్‌ కూడా చేశారు. ‘ఈనాడు’ కథనంతో అక్రమార్కుల వెన్నులో చలి మొదలైంది. ఎక్కడ ఆక్రమణ భూములను స్వాధీనం చేసుకుంటారో అనే ఉద్దేశంతో భూములను కొన్న కొందరు అధికార పార్టీకి చెందిన కీలక నేతను ఆశ్రయించినట్లు తెలిసింది. సంబంధిత నేత కూడా అక్కడ ఇప్పటికే తమ అనుచరుల ద్వారా 15 ఎకరాలు కొనుగోలు చేయించినట్లు తెలిసింది. దీంతోపాటు మరో 85 ఎకరాలను కూడా కొనుగోలు చేసి ఇక్కడో ఎస్టేట్‌ కింద ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ భూముల విషయంలో జోక్యం చేసుకోవద్దని రెవెన్యూ, పోలీసు అధికారులకూ మౌఖిక ఆదేశాలు అందాయని చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కఠినంగా వ్యహరించడం లేదని ఆరోపించారు. కేంద్ర మాజీ మంత్రితోపాటు మరికొందరు పలుకుబడిగల వారికి ఇక్కడ భూములున్నట్లు తెలిసింది. రైతుల దగ్గర ఉన్న మిగిలిన 209 ఎకరాలను కూడా నయానో భయానో చేజిక్కించుకోవాలని మరికొంతమంది ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా అక్రమాల విషయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హరీష్‌ కఠినంగా వ్యవహరిస్తారు. కానీ ఉన్నతస్థాయిలో వచ్చిన ఒత్తిడితో ఆయన కూడా దీనిపై మాట్లాడటం లేదని చెబుతున్నారు.

కలెక్టర్‌ కార్యాలయ ముట్టడికి హెచ్చరిక

అన్యాక్రాంతమవుతున్న ఈ భూములను కాపాడాలంటూ మదనపల్లి కొత్త తండా పంచాయతీ వార్డు సభ్యులు, స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. భూములను రెవెన్యూ అధికారులు తూతూమంత్రంగా పరిశీలించి వెళ్లిపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అధికారులు వచ్చినట్లు తెలుసుకుని స్థానికులు అక్కడికి చేరుకునేలోపే వారు ఫొటోలు దిగి వెళ్లిపోయారన్నారు. ఈనేపథ్యంలో పరిసర గ్రామాల ప్రజలతో కలిసి కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.


అసైన్డ్‌ భూములను క్రయ, విక్రయాలు చేస్తే సహించేది లేదు
- తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, శంషాబాద్‌

సర్వే చేస్తున్న తహసీల్దార్‌ శ్రీనివాసరెడ్డి

మదనపల్లిలో రెవెన్యూ సర్వే సంఖ్య 50లోని అసైన్డ్‌ భూములను, అక్రమ లేఅవుట్లను పరిశీలించాం. ఇక్కడ 559 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. వీటిలో 394 ఎకరాలు భూమి లేని గిరిజన రైతులకు, 143 ఎకరాలను మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులకు ప్రభుత్వం కేటాయించింది. ఇవన్నీ నిషేధిత జాబితాలో ఉన్నా సబ్‌రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. సమగ్ర విచారణ చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని