logo

అబలకు బలం.. బలగం

అనుమానంతో వేధించే వారొకరు.. కట్నం కోసం పీడించేదొకరు.. మద్యానికి బానిసై కయ్యానికి దిగేవారొకరు.. భర్త నుంచి వేర్వేరు రూపాల్లో గృహహింసకు గురవుతున్న మహిళల్లో భరోసా నింపి కుటుంబ సభ్యుల్లా మేమున్నామంటూ తోడుగా నిలుస్తున్నారు పోలీసులు.

Published : 27 May 2023 01:47 IST

న్యూస్‌టుడే, నాగోలు

అనుమానంతో వేధించే వారొకరు.. కట్నం కోసం పీడించేదొకరు.. మద్యానికి బానిసై కయ్యానికి దిగేవారొకరు.. భర్త నుంచి వేర్వేరు రూపాల్లో గృహహింసకు గురవుతున్న మహిళల్లో భరోసా నింపి కుటుంబ సభ్యుల్లా మేమున్నామంటూ తోడుగా నిలుస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకోకుండా వారిని ఒక్కటి చేసేందుకు ఒక వ్యవస్థనే ఏర్పాటు చేశారు.

ఏంటా వ్యవస్థ..

వేధింపులు ఎదుర్కొంటున్న వారి బాధ వినేందుకు పోలీసు శాఖలోని ఉమెన్‌ సేఫ్టీ విభాగం.. మహిళా సాధికారత, అభివృద్ధి కేంద్రం(సీడీఈడబ్ల్యూ) అందుబాటులోకి తెచ్చింది.

ఎక్కడెక్కడ ఉన్నాయి?

నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిలో ఇప్పటికే 13 కేంద్రాలు అందుబాటులోకి రాగా... 26 కేంద్రాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహిళలకు అత్యంత చేరువలో ప్రతి సబ్‌ డివిజన్‌లో ఈ కేంద్రాలు ఉండేలా చొరవ తీసుకుంటున్నారు.

అక్కడ ఏం చేస్తారు..

కాపురాలను నిలబెట్టడానికి నిపుణులైన, నిష్ణాతులైన కౌన్సిలర్లు అవసరముండటంతో సమాజంలోని నిపుణులను ఎంపికచేసి శిక్షణ ఇచ్చి మరీ సీడీఈడబ్ల్యూ కేంద్రాల్లో నియమించారు.

ఇక్కడ ఓ మహిళా కౌన్సెలర్‌తోపాటు ఓ మహిళా రిసెప్షనిస్టు ఉంటారు.

ఇక్కడి మహిళా కానిస్టేబుళ్లూ యూనిఫాంలో కాకుండా మఫ్టీలోనే ఉంటూ ఆత్మీయుల్లా ఆ మహిళలకు భరోసానిస్తారు.

ఇదే కేంద్రంలో చిన్నారుల కోసం ఓ గదిలో ఆట వస్తువులు అందుబాటులో ఉంటాయి.  

ఆయా కేంద్రాల నిర్వహణ బాధ్యతలను అక్కడి ఠాణాలకు చెందిన ఎస్‌హెచ్‌వోలు స్వీకరించారు.

వివాహ బంధాలను ఒక్కటిగా ఉంచేందుకు ఇక్కడి కౌన్సిలర్లు శతవిధాలా ప్రయత్నిస్తారు. సరైన మార్గనిర్దేశం చేస్తారు. వ్యక్తిగతంగానూ, దంపతులిద్దరినీ కలిపి కౌన్సెలింగ్‌ ఇస్తారు.

హింస మరీ తీవ్రంగా ఉండి.. ఫిర్యాదీదారులు కలిసి వుండే వీలులేని పరిస్థితుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.


నేస్తంలా ఉండేలా..

హిళ ఒంటరిగా బాధపడకుండా ఆమె బాధ విని భద్రత కల్పించి భరోసానిచ్చే నేస్తంగా ఉండేలా ఈ కేంద్రాలను నిర్వహించనున్నట్లు రాచకొండ కమిషనరేట్‌ ఉమెన్‌ సేఫ్టీ విభాగం డీసీపీ శ్రీబాల తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు