logo

విచార యాత్ర

రైలు ప్రమాద ఘటన నగర సందర్శనకు వచ్చిన ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. నగరాన్ని తిలకించడానికి కేరళ నుంచి కుటుంబ సభ్యులు, బంధువులతో వచ్చిన గృహిణి ప్రమాదవశాత్తు రైలుకింద పడి చనిపోగా, ఆమె ఐదేళ్ల కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

Published : 27 May 2023 01:47 IST

రైలు కిందపడి తల్లి మృతి
కుమారుడికి తప్పిన ప్రమాదం

కాచిగూడ, న్యూస్‌టుడే: రైలు ప్రమాద ఘటన నగర సందర్శనకు వచ్చిన ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. నగరాన్ని తిలకించడానికి కేరళ నుంచి కుటుంబ సభ్యులు, బంధువులతో వచ్చిన గృహిణి ప్రమాదవశాత్తు రైలుకింద పడి చనిపోగా, ఆమె ఐదేళ్ల కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రావు కథనం ప్రకారం.. కేరళ మలప్పురానికి చెందిన మహమ్మద్‌ నసీర్‌ దుబాయ్‌లో ఉంటున్నాడు. ఏడాదికోసారి ఇంటికి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు బయలుదేరుతాడు. దుబాయ్‌ నుంచి వచ్చిన అతను తన భార్య షకీరా(24), ఐదేళ్ల కుమారుడు, కుటుంబ సభ్యులు, బంధువులు 11 మందితో హైదరాబాద్‌ నగరాన్ని చూడడానికి బయలుదేరారు. గురువారం రాత్రి వారు తిరూర్‌ స్టేషన్లో మంగళూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కి కాచిగూడకు వస్తున్నారు. గురువారం అర్ధరాత్రి రైలు మలక్‌పేట స్టేషన్లో ఆగింది. అదే కాచిగూడ అనుకుని అంతా దిగారు. కాదని తెలుసుకుని అంతా రైలు ఎక్కారు. తన కుమారుడిని ఎత్తుకున్న షకీరా ఎక్కుతుండగా రైలు కదిలింది. ఆమె రైలు కింద పడిపోగా ఎడమ చెయ్యి తెగిపోయింది. ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అధిక రక్తస్రావంతో మృతిచెందింది. కుమారుడు గాయాలతో బయటపడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని