logo

పేరుకుపోయిన అవినీతి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కేసీఆర్‌ కిట్లు అందిస్తుంటే.. పలువురు జీహెచ్‌ఎంసీ సిబ్బంది సంబంధిత ధ్రువపత్రాలివ్వడంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

Published : 27 May 2023 01:47 IST

రూ. 2 వేలు ఇవ్వకపోతే జనన దరఖాస్తులను తిరస్కరిస్తున్న బల్దియా సిబ్బంది
ఈనాడు, హైదరాబాద్‌

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కేసీఆర్‌ కిట్లు అందిస్తుంటే.. పలువురు జీహెచ్‌ఎంసీ సిబ్బంది సంబంధిత ధ్రువపత్రాలివ్వడంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పుట్టిన తేదీ సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు కనీసం రూ.2వేలు ఇవ్వాల్సిందేనంటూ దళారులతో బేరాలు సాగిస్తున్నారు. దళారుల్లేని దరఖాస్తులు, ముఖ్యంగా నగరంలోని వేర్వేరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులకు సంబంధించినవి 50శాతం మేర తిరస్కరణకు గురవుతున్నాయంటే దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. లంచం ముట్టని దరఖాస్తులను తిరస్కరించడం లేదా పేర్లు తప్పుగా నమోదుచేసి ధ్రువపత్రాలు ఇవ్వడం కొందరు సిబ్బందికి అలవాటుగా మారింది. అచ్చు తప్పులతో ధ్రువపత్రాలు అందుకున్న తల్లిదండ్రులు మరిన్ని ఇబ్బందులకు గురవుతున్నారు.

దోపిడీకి గురవుతున్న పేదలు

రాష్ట్రం నలుమూలల నుంచి గర్భిణులు కాన్పు కోసం నగరంలోని పలు ఆస్పత్రులను సంప్రదిస్తుంటారు. పేద, మధ్య తరగతి కుటుంబాలవారు నీలోఫర్‌, పేట్లబుర్జు, గాంధీ, ఉస్మానియా, కింగ్‌కోఠి ప్రసూతి వైద్యశాలలను ఆశ్రయిస్తుంటారు. వాటితో పాటు నగరంలోని వేర్వేరు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాల్లో రోజూ వందలాది జననాలు నమోదవుతున్నాయి.

ఆస్పత్రుల్లో జన్మించిన చిన్నారులకు జనన ధ్రువపత్రం తీసుకోవాలంటే.. రాష్ట్రంలోని ఏ మీసేవ కేంద్రం నుంచైనా జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆస్పత్రులు అప్పటికే బల్దియాకు జననాల వివరాలు ఇచ్చి ఉంటాయి. ఆ సమాచారంతో సరిపోల్చుకుని.. జీహెచ్‌ఎంసీ అధికారులు జనన ధ్రువపత్రం జారీ చేస్తారు. వాటిని రాష్ట్రంలోని ఏ మీసేవ కేంద్రంలోనైనా ముద్రించుకోవచ్చు. కింగ్‌కోఠి, నీలోఫర్‌, గాంధీ, పేట్లబుర్జు, ఉస్మానియా, పలు ఇతర ఆస్పత్రుల్లోని జననాలకు అలా జరగట్లేదు. జీహెచ్‌ఎంసీ సిబ్బందితో పాటు మీసేవ కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వివరాలు నమోదుచేసే సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు.


కేంద్రం చెప్పినా పట్టించుకోలే..

జీహెచ్‌ఎంసీలోని జనన, మరణ ధ్రువపత్రాల జారీ విభాగం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జనన, మరణాల నమోదు చట్టంపై ఉన్నతాధికారులకు పట్టు లేదు. ఈ విషయంలోనే గతంలో కేంద్ర సర్కారు బల్దియాకు అక్షింతలు వేసింది. సొంతంగా అవలంభిస్తున్న విధానంతో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలు జారీ అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేసింది. కేంద్రం అన్ని రాష్ట్రాలకు అందిస్తున్న సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలని, నకిలీలు ఉండవని, జనాభాపై స్పష్టత వస్తుందని వేర్వేరు అంశాలతో లేఖ రాసింది. బల్దియా అధికారులు ఆ లేఖను పట్టించుకోలేదు.


బల్దియా సిబ్బంది కొంతకాలంగా రోజూ 100 నుంచి 200 జనన ధ్రువపత్రాల దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసినా, అక్కడ సమర్పించిన దరఖాస్తులను జీహెచ్‌ఎంసీలో ఇవ్వాలని అడుగుతున్నారు. ఇటీవల పార్శిగుట్టకు చెందిన ఓ వ్యక్తి.. తన కొడుకు జనన ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటివరకు మూడు సార్లు తిరస్కరించారు. సంతకం సరిపోలట్లేదని, దస్త్రాలు కనిపించడం లేదని, అఫిడవిట్‌ నోటరీ చేయించలేదనే కారణాలతో తిరస్కరిస్తున్నారు.

కొన్ని సందర్భాల్లో బల్దియా సిబ్బంది.. దరఖాస్తుదారుల పేర్లను సర్టిఫికెట్లపై తప్పుగా నమోదుచేస్తున్నారు. దీంతో దరఖాస్తుదారు ఒక్కోసారి రూ.200కుపైగా ఖర్చు చేయాల్సి వస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు