logo

సాంకే‘తికమకలే’ పెట్టుబడులు

బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ పాఠశాలల యజమానులే లక్ష్యంగా బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు వసూలు చేస్తున్న ముఠా ఆట కట్టించారు రాచకొండ పోలీసులు.

Updated : 27 May 2023 03:03 IST

వ్యాపారులను బెదిరిస్తున్న ముగ్గురి అరెస్ట్‌

కాప్రా, న్యూస్‌టుడే: బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ పాఠశాలల యజమానులే లక్ష్యంగా బెదిరింపులకు పాల్పడుతూ డబ్బు వసూలు చేస్తున్న ముఠా ఆట కట్టించారు రాచకొండ పోలీసులు. ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్‌ బి.ప్రవీణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. నగరంలోని ఆదర్శనగర్‌లోని నౌబత్‌పహాడ్‌కు చెందిన బిట్ల రాజేష్‌ (28), కాప్రాలోని మాధవపురికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఫ్రీలాన్స్‌ ఉద్యోగి మానుకొండ ప్రదీప్‌ కుమార్‌ (43), బషీర్‌బాగ్‌కు చెందిన సన్నాయిల శ్రీకాంత్‌ (36) ముఠాగా ఏర్పడి బెదిరింపులకు పాల్పడుతున్నారు. వ్యాపారులు, కార్పొరేట్‌ స్కూళ్లు, పారిశ్రామికవేత్తలకు చెందిన సంస్థలపై ప్రభుత్వ శాఖలు, వినియోగదారులకు అంతర్జాలం ద్వారా సందేశాలు పంపిస్తూ, వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. సాంకేతికపరమైన అనుభవం ఉన్న ప్రదీప్‌ ఎంచుకున్న సంస్థలకు సందేశాలు పంపిస్తాడు. వీటి ఆధారంగా బిట్ల రాజేష్‌ రంగంలోకి దిగి సదరు సంస్థలకు చెందిన వ్యక్తులను బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేస్తుంటాడు. కుషాయిగూడలోని కమలానగర్‌లో ఉంటున్న నాగేశ్వరరావుకు చరవాణుల పార్టుల దిగుమతి, ఎగుమతి వ్యాపారం ఉంది. వ్యాపారం నిమిత్తం దుబాయ్‌, మలేసియా వెళ్తుంటాడు. నాగేశ్వరరావుకు శ్రీకాంత్‌ స్నేహితుడు. అతడి ద్వారా కొంతకాలం క్రితం ప్రదీప్‌, రాజేష్‌ పరిచయమయ్యారు. నాగేశ్వరరావుపై గతంలో మాదాపూర్‌ ఠాణాలో కేసు నమోదు అయింది. ఈ కేసులో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని అతని వినియోగదారులకు తప్పుడు మెయిల్స్‌ పెడుతూ బ్లాక్‌ మెయిల్‌ చేశారు. రూ.25 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని వీరు కొంతకాలంగా బెదిరిస్తున్నారు. గురువారం కాప్రాలోని రాధికా చౌరస్తా వద్ద నాగేశ్వరరావు రూ.5 లక్షలు ఇస్తుండగా పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లిన కుషాయిగూడ, ఎస్‌ఓటీ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని