logo

నిబంధనలకు తిలోదకం ప్రాణాలతో చెలగాటం

గ్రేటర్‌ పరిధిలో, శివారు ప్రాంతాల్లో రెడ్‌, ఆరెంజ్‌ కేటగిరీల్లో ఉన్న కొన్ని ఫార్మా, బల్క్‌డ్రగ్‌ పరిశ్రమల నుంచి శుద్ధి చేయకుండా వదిలేస్తున్న హానికర వ్యర్థాలతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర కాలుష్యం ఏర్పడుతోంది.

Published : 27 May 2023 01:47 IST

గ్రేటర్‌లో పరిశ్రమలపై పీసీబీ కొరడా              
ఈనాడు, హైదరాబాద్‌

గ్రేటర్‌ పరిధిలో, శివారు ప్రాంతాల్లో రెడ్‌, ఆరెంజ్‌ కేటగిరీల్లో ఉన్న కొన్ని ఫార్మా, బల్క్‌డ్రగ్‌ పరిశ్రమల నుంచి శుద్ధి చేయకుండా వదిలేస్తున్న హానికర వ్యర్థాలతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర కాలుష్యం ఏర్పడుతోంది. పీసీబీ టాస్క్‌ఫోర్స్‌ తనిఖీల్లో అలాంటి 9 పరిశ్రమలను గుర్తించి వాటిని మూసివేయాలని ఆదేశించింది. కావాల్సిన అనుమతులు తీసుకోకుండా, హానికర వ్యర్థాలను నేరుగా వదిలేస్తున్న పరిశ్రమలపై ఫిర్యాదులొస్తే ఉపేక్షించేంది లేదని పీసీబీ అధికారులు చెబుతున్నారు.  

ఉదంతాలివీ...  రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం బ్రాహ్మణపల్లిలో ఉన్న కాన్‌కోర్డ్‌ డ్రగ్స్‌ లిమిటెడ్‌ పరిశ్రమ ప్రతిరోజూ 50వేల క్యాప్సూల్స్‌, 3 లక్షల మాత్రలు, 40వేల ఇంజెక్టబుల్స్‌, 5కిలోలీటర్ల హ్యాండ్‌ శానిటైజర్‌, సర్జికల్‌ స్పిరిట్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ పరిశ్రమ నుంచి హానికర వ్యర్థాలు విడుదలవుతున్నాయని జనవరి నెలలో తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీలో ఫిర్యాదు చేశారు. ట్యాంకర్ల ద్వారా వ్యర్థాలను తీసుకొచ్చి పారబోస్తున్నారంటూ వివరించారు. ఈ క్రమంలో జనవరి 4న రాత్రి 9గంటల ప్రాంతంలో స్థానిక వ్యక్తి సంస్థకు చెందిన వ్యర్థాల ట్యాంకర్‌ను పట్టుకున్నారు.  2016లో కన్‌సెంట్‌ ఫర్‌ ఆపరేషన్స్‌(సీఎఫ్‌వో)కి అనుమతి తీసుకున్న పరిశ్రమ నిర్వాహకులు, 2021 తర్వాత రెన్యువల్‌ చేసుకోలేదని, ఎఫ్లుయెంట్‌ ట్రీట్‌మెంట్‌ప్లాంట్‌కి తరలించకుండా వ్యర్థాలను  ట్యాంకర్లతో పారబోస్తున్నారని గుర్తించి మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహించడంతో పాటు హానికర వ్యర్థాలను వదిలేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బి.ఎన్‌.రెడ్డినగర్‌లోని తుల్జభవాని ఇండస్ట్రీస్‌ను మూసివేయాలని పీసీబీ ఆదేశించింది. డ్రైనేజీ కనెక్టివిటీ లేని చోట, సాల్వెంట్లు, ఇతర వ్యర్థాలను రోడ్లపైకి వదిలేస్తున్నారని గుర్తించారు. ఈ పరిశ్రమ ఆరెంజ్‌ కేటగిరీలోకి వస్తుందని, నిబంధనల ప్రకారం ఇటువంటివి ఓఆర్‌ఆర్‌ లోపల ఉండకూదని చెబుతూ మూసివేయాలని ఆదేశాలిచ్చింది.

మేడ్చల్‌ మాల్కాజిగిరి జిల్లాలోని నారిన్‌ ఇండస్ట్రీస్‌ హానికర రసాయనాలను కలిపే, స్టోరేజ్‌ యూనిట్‌కి సైతం కన్‌సెంట్‌ ఫర్‌ ఆపరేషన్స్‌ (సీఎఫ్‌వో), కన్‌సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (సీఎఫ్‌ఇ) లేదని, పరిశ్రమల ఉత్పత్తి ప్రక్రియలో చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగేలా వాసనలు వస్తున్నాయని గుర్తించారు. హానికర ప్రదేశంలో పనిచేస్తున్నామన్న సంగతి అక్కడి సిబ్బందికి అవగాహన లేదని, ఆరెంజ్‌ కేటగిరీలో ఉన్న పరిశ్రమ ఓఆర్‌ఆర్‌ లోపలు ఉండకూడదంటూ మూసివేతకు ఆదేశాలిచ్చింది.


బయట తాళాలు...లోపల నిషేధిత ఉత్పత్తులు..

లు ఫార్మా, బల్క్‌డ్రగ్‌ కంపెనీల్లో వ్యర్థాలను శుద్ధి చేయకుండా కంపెనీల ఆవరణలో నిల్వ చేస్తున్నారు. భారీ వర్షాలకు వరదతో పాటే ఈ వ్యర్థాలూ సమీప చెరువులు, కుంటల్లోకి చేరి అవి కాలుష్య కాసారమవుతున్నాయి. మరికొందరు ట్యాంకర్లలో వ్యర్థాలను తరలించి ఔటర్‌ పరిసరాల్లో ఉన్న పలు చెరువులతో పాటు మూసీలోకి యథేచ్ఛగా డంపింగ్‌ చేస్తున్నారు. నగరంలో పదికి పైగా పారిశ్రామికవాడల్లో 3వేలకు పైగా బల్క్‌డ్రగ్‌, రసాయనాల తయారీ, ఇంజినీరింగ్‌, తదితర రంగాలకు చెందిన పరిశ్రమలున్నాయి. పాశమైలారం, జీడిమెట్ల, చర్లపల్లి, కాటెదాన్‌, జిన్నారం, బొల్లారం తదితర పారిశ్రామికవాడల్లో అనుమతులు లేకుండా నిర్వహించే పరిశ్రమలెన్నో ఉన్నాయి. కొందరు మూసివేసిన పరిశ్రమలను ఎంచుకుని ముందు ద్వారాలకు తాళాలు వేసి లోపల నిషేధిత ఉత్పత్తులను తయారుచేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని