logo

అరచేతిలో రుణం అతివకు అభయం

జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీకి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సన్నాహాలు చేశారు.

Published : 27 May 2023 01:47 IST

డ్వాక్రా మహిళలకు రూ.463 కోట్లు విడుదల
న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీకి గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సన్నాహాలు చేశారు. ఆర్థిక సంవత్సరం రుణాల లక్ష్యాన్ని ఏప్రిల్ల్‌ో ఖరారు చేశారు. తాజాగా రుణాల్ని అందించేందుకు సంఘాల సమాచారాన్ని సిద్ధం చేశారు.

పూచీకత్తు లేకుండానే..

జిల్లాలో గ్రామీణ ప్రాంత మహిళలకు మహిళా సమాఖ్యల ద్వారా, పట్టణాల్లో మెప్మా ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలు అందజేస్తున్నారు. పూచీకత్తు లేకుండా రూ.లక్ష నుంచి రూ.15 లక్షల దాకా రుణాలు ఇస్తుండటంతో మహిళలు ఉత్సాహం చూపుతున్నారు. రుణాలతో ఆసక్తి ఉన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు, సేంద్రియ వ్యవసాయం, పాడిపశు పోషణ, అంతర్జాల కేంద్రాలు, హోటళ్లు, బ్యూటీపార్లర్‌, కిరాణా దుకాణాలు, అలంకరణ వస్తు విక్రయాలు, వస్త్ర దుకాణాలు, దర్జీ వృత్తి శిక్షణ కేంద్రాల్ని నెలకొల్పుతున్నారు. ఆయా వ్యాపార కార్యకలాపాలతో మహిళలు ఉపాధి పొందుతూ.. మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. తోటి మహిళలు, యువతులకు శిక్షణ ఇచ్చి సొంతకాళ్ల మీద నిలబడేలా తీర్చిదిద్దుతున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఏపీఎంలు, సీసీలు నిరంతరం పర్యవేక్షిస్తూ వ్యాపారాలు, పరిశ్రమల నిర్వహణలో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. దీంతో మహిళలు సొంతూళ్లలోనే వ్యాపారాలు, స్వయం ఉపాధి యూనిట్లు నిర్వహిస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు.

అత్యధికంగా కుల్కచర్లలో..

ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో అత్యధికంగా కుల్కచర్ల మండలంలో 810 సంఘాలకు రూ.34.37కోట్లు రుణాలు అందించేందుకు నిర్దేశించారు. పెద్దేముల్‌, దౌల్తాబాద్‌ మండలాల్లో 650కిపైగా సంఘాలకు రూ.31కోట్లు రుణాలు ఇచ్చేందుకు ఖరారు చేయడంతో తర్వాతి స్థానంలో ఉన్నాయి. అత్యల్పంగా చౌడాపూర్‌ మండలంలో 149 సంఘాలకు రూ.7కోట్లు అందించనున్నారు. తాండూరు మండలంలో 623 సంఘాలకు రూ.26.34కోట్లు, వికారాబాద్‌ మండలంలోని 498 సంఘాలకు రూ.24.73కోట్లు ఇవ్వనున్నారు. పరిగిలో 589 సంఘాలకు రూ.24.93కోట్లు, కోడంగల్‌లో 454 సంఘాలకు రూ.19.27 కోట్లు రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు.

తగ్గిన బకాయిలు

జిల్లాలోని సంఘాల నుంచి బకాయిల వసూళ్లలో ప్రగతి సాధించారు. 7.5శాతంగా ఉన్న రుణ బకాయిలను వసూలు చేయడంతో 2.3శాతానికి తగ్గింది. సభ్యురాళ్లు పొందిన రుణాలను 36 నుంచి 60 నెలల వాయిదాల్లో చెల్లించాల్సి ఉండగా అనివార్య కారణాల వలన కొందరు చెల్లించలేక వెనకబడుతున్నారు. అలాంటి వారిపై గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించి అవగాహన కల్పిస్తున్నారు. వాయిదాలు చెల్లించి తిరిగి రుణాలు పొందేలా కృషి చేస్తున్నారు. దీంతో సంఘాలు గాడినపడి మహిళల ఆర్థిక ప్రగతికి తోడ్పడుతోంది.


ఫిబ్రవరిలోగా వంద శాతం రుణాలు

- వీరయ్య, డీపీఎం, గ్రామీణాభివృద్ధి శాఖ

ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాం. స్వయం సహాయక సంఘాల బ్యాంకు ఖాతాల్లో నేరుగా సొమ్ము జమ  అవుతోంది. అధ్యక్ష, కార్యదర్శులతోపాటు సభ్యులు పొందొచ్చు. ఈసారి వంద శాతం రుణాల పంపిణీ లక్ష్యాన్ని 2024 ఫిబ్రవరిలో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని