logo

రుణ‘మాఫీ’పైనే ఆశలన్నీ..!

రైతన్నకు కష్టకాలంలో ఊరటనిచ్చేది..రుణమాఫీ. దీనికోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు.  రూ.లక్ష వరకు పంట రుణ మాఫీ రుణమాఫీ ప్రక్రియ ఎప్పుడనేది నేటికీ ప్రభుత్వం ప్రకటించలేదు.

Published : 28 May 2023 01:45 IST

ప్రకటనకు రైతన్నల ఎదురుచూపు  
ఖాతాలను నిలిపేస్తున్న బ్యాంక్‌ అధికారులు

న్యూస్‌టుడే, వికారాబాద్‌, తాండూరు: రైతన్నకు కష్టకాలంలో ఊరటనిచ్చేది..రుణమాఫీ. దీనికోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు.  రూ.లక్ష వరకు పంట రుణ మాఫీ రుణమాఫీ ప్రక్రియ ఎప్పుడనేది నేటికీ ప్రభుత్వం ప్రకటించలేదు. వానాకాలం సీజన్‌ సమీపంలోనే ఉంది. ఈలోగానే మాఫీ ప్రకటన వెల్లడిస్తే ఎంతో వెసులుబాటు ఉంటుందని రైతులు ఆశ పడుతున్నారు. ఇదే సమయంలో రుణాల నవీకరణతో పాటుగా నూతన మంజూరు లేక వానాకాలం సాగు పనులు మందగించే పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.


గతంలో నాలుగు విడతలు

2014లో భారాస అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో రైతుకు రూ.లక్ష వరకు పంట రుణాన్ని మాఫీ చేశారు. నాలుగు విడతలుగా 25 శాతం చొప్పున బ్యాంకులకు విడుదల చేశారు. ఇలా మొదటిసారి జిల్లాలో 1.46 లక్షల మంది రైతులకు రూ.224 కోట్ల వరకు పంట రుణం మాఫీ అయింది.


పరిధిలోకి రామనే భయం

ప్రస్తుతం రూ.లక్ష వరకు రుణమాఫీ కోసం 1.86 లక్షల మంది రైతులు నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం పేర్కొన్న నిబంధన ప్రకారం 2018 డిసెంబరు 11వ తేదీ కంటే ముందుగా తీసుకున్న రుణాలన్నింటికీ మాఫీ వర్తింపచేసే అవకాశముంది. డిసెంబరు 11 తర్వాత రెన్యూవల్‌ చేసినా మాఫీ పరిధిలోకి రామనే భయంతో తమ రుణ గడువు మీరినా కొందరు రైతులు బ్యాంకులకు రావడం లేదు.  


పెరుగుతున్న వడ్డీ..

పంట రుణం తీసుకున్న తేదీ నుంచి ఏడాదిలోపు వడ్డీతో సహా అసలును చెల్లిస్తే రూ.లక్ష వరకు సున్నా వడ్డీ, రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు పావలావడ్డీ పర్తింపజేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ రీఎంబర్స్‌మెంట్‌ను సకాలంలో బ్యాంకులకు విడుదల చేయనందున కొందరు బ్యాంకర్లు రైతుల నుంచి వడ్డీని వసూలు చేస్తున్నాయి.  
* ధారూర్‌ మండలం అల్లీపూర్‌కు చెందిన రైతు నర్సిములు నాలుగేళ్ల కిందట ధారూర్‌ ఎస్‌బీఐ శాఖలో పంటల పెట్టుబడికి రూ.1.5 లక్షల రుణం తీసుకున్నాడు. రూ.లక్ష రుణమాఫీ అవుతుందని నవీకరణ చేయించలేదు. దీంతో వడ్డీతో కలిపి రూ.2.18 లక్షలైంది. కుటుంబ అవసరాల నిమిత్తం మరొకరి దగ్గర నుంచి రూ.లక్ష బ్యాంకు ఖాతాలో జమ చేయించుకున్నారు. డబ్బులు డ్రా చేసుకుందామని ఏటీఎం కేంద్రానికి వెళ్లగా, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ జీరోగా కనిపించింది. ఆందోళనకు గురైన నర్సిములు బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా, పంట రుణం చెల్లించనందుకు ఖాతాను నిలిపేశామని, వడ్డీతో కలిపి మొత్తం చెల్లిస్తేనే ఖాతా పునరుద్ధరిస్తామన్నారు.


రెన్యువల్‌ చేసుకున్నా ఇబ్బంది లేదు..: రాంబాబు, మేనేజర్‌, లీడ్‌ బ్యాంకు, వికారాబాద్‌

రైతులు ప్రస్తుతం వారి అప్పులను చెల్లించి రెన్యువల్‌ చేసుకున్నా తొలిసారి తీసుకున్న తేదీని అనుసరించి పాత రుణంగానే పరిగణిస్తారు. కాబట్టి మాఫీకి ఎలాంటి ఇబ్బంది లేదు. 2018 డిసెంబరు 11 వరకున్న పంట రుణాలన్నీ పరిగణనలోకి తీసుకుని అర్హులకు రుణాన్ని మాఫీ చేసే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని