logo

రూ.50 ఏం సరిపోతాయండీ..

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా కొత్త దుస్తులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.

Published : 28 May 2023 01:45 IST

ఏకరూప దుస్తులు కుట్టేందుకు దర్జీల నిరాసక్తత

న్యూస్‌టుడే, బషీరాబాద్‌, పాత తాండూరు: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా కొత్త దుస్తులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా వచ్చే విద్యా సంవత్సరం ‘ఏకరూప’ దుస్తులు అందించాలని ప్రభుతం సన్నాహాలు మొదలుపెట్టింది. వీటిని కుట్టేందుకు దర్జీలు ‘కూలీ సరిపోదంటూ’ ఆసక్తి చూపించడం లేదు. ‘ఒకజత కుడితే ప్రైవేటులో ఆరింతలు తీసుకుంటాం.. మీరిచ్చే రూ.50 ఏం సరిపోతాయని’ వాపోతున్నారు. ‘మేమేం చేయలేం.. ఉన్నతాధికారులు నిర్ణయించిన ధర అది. కుట్టండి’ అంటూ ఉపాధ్యాయులు దర్జీలను కోరుతున్నారు. కూలీ పెంచాలని దర్జీలు ఒత్తిడి తెస్తున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.


1.15 లక్షల మంది విద్యార్థులు

జిల్లాలోని 19 మండలాల పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 1,325 ఉన్నాయి. వీటిల్లో 1,15లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ బడులతో పాటు కస్తూర్బా విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలకు ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు జతల ఏకరూప దుస్తులను అందజేస్తోంది. 2022-23 సంవత్సరానికి 53,058 మంది బాలురు, 54,730 మంది బాలికలకు ఈ  దుస్తులను అందించనున్నారు.


కొన్నిచోట్ల పాత తరహాలోనే..

ధర తక్కువగా ఉండడంతో కొన్ని మండలాల్లో పాఠశాలల యాజమాన్య కమిటీలు పాత పద్ధతిన కుట్టిస్తున్నారు. ఇదేంటని ఉపాధ్యాయులు అడిగితే.. కొత్త పద్ధతిన కుట్టేందుకు ఖర్చు ఎక్కువవుతుందని.. మీరిస్తామంటే కుడతాం అంటున్నారని.. ఎలాగోలాగ కుట్టండని.. పాత పద్ధతినే అనుసరిస్తున్నామని ఆయా పాఠశాలల ఎస్‌ఎంసీ ఛైర్మన్లు పేర్కొంటున్నారు. మరికొన్ని చోట్ల దుస్తులు నాసిరకంగా కుడుతున్నారు. మరికొన్ని చోట్ల ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ అధ్యక్షులు, సభ్యులు సొంతంగా అదనపు డబ్బులు ఇచ్చి కుట్టిస్తున్నారు.


కనీసం రూ.200 ఇవ్వాలి

ఈసారి ఏకరూప దుస్తులు కుట్టే విధానంలో మార్పులు చేయడంతో పని ఎక్కువ అవుతోందని కనీసం ఒకజత కుట్టేందుకు రూ.200 ఇవ్వాలని దర్జీలు కోరుతున్నారు. 1-3తరగతి వరకు, 4-5 వరకు, 6-12 వరకు బాలికలకు విడి రకాలుగా, 1-12 వరకు కొలతల ఆధారంగా, వయసుల వారీగా కుట్టాల్సి ఉంటుంది. అమ్మాయిలకు చిన్నారులకు షర్టు, గౌను, పట్టీలు పెట్టి చక్కగా కుట్టడం, పెద్ద వారికి కాలర్‌ పట్టీలు, కోట్‌, చొక్కా, జేబులు, భుజాలపై క్లాపులు, చేతి భాగంలో క్లిప్పులు చుట్టాల్సి ఉంటుంది. ఒక జతకు రూ.50 చొప్పున రెండు జతలకు రూ.100 ఇస్తే ఏం సరిపోతాయని పేర్కొంటున్నారు.


ఉన్నతాధికారులకు వివరిస్తాం: సుధాకర్‌రెడ్డి, విద్యాధికారి, యాలాల, బషీరాబాద్‌

ఏకరూప దుస్తులు కుట్టేందుకు ఆయా గ్రామాల వారీగా దర్జీలకు అప్పగించాం. కుట్టుకూలీ పెంచాలని దర్జీలు కోరుతున్న మాట వాస్తవమే. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వివరిస్తాం. పాఠశాలల ప్రారంభం నాటికి ఏకరూప దుస్తులు అప్పగించాలని ఆదేశాలున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని