logo

చేసిన ప్రగతి చెప్పడానికే ఉత్సవాలు: సబిత

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లా ప్రజలకు చేసిన అభివృద్ధిని చెప్పడానికే దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు.

Published : 28 May 2023 01:45 IST

మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి. చిత్రంలో ఎమ్మెల్యేలు

వికారాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లా ప్రజలకు చేసిన అభివృద్ధిని చెప్పడానికే దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడితే చీకటి అలుముకుంటుందని చెప్పారని, ఇందుకు భిన్నంగా వెలుగులు విరజిమ్ముతూ తొమ్మిదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని శాఖల వారీగా గర్వంగా చాటుతామన్నారు.
* కేసీఆర్‌ ప్రభుత్వం వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని విజయవంతంగా దశాబ్దంలోకి అడుగుపెడుతోందని అన్నారు. అందుకే జూన్‌ 2 నుంచి 22 వరకు రోజుకో కార్యక్రమం చొప్పున పండుగలా నిర్వహించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు, వచ్చిన అనంతరం జరిగిన అభివృద్ధిని బేరీజు వేేస్తూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.
* ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రైతు వేదికల దగ్గర ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రైతులతో కలిసి సహపంక్తి భోజనాలు చేయాలన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, వారికి నివాళ్లు అర్పించడంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు అమరవీరుల సంస్మరణ సభ, అమరవీరుల స్థూపం ఆవిష్కరణతో ముగుస్తాయని తెలిపారు. ఇవే విషయాలను పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. అనంతరం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహం సమీపంలో అమరవీరుల స్మారక స్థూపాన్ని నిర్మించడానికి స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, వికారాబాద్‌, పరిగి, తాండూర్‌, కొడంగల్‌, చేవెళ్ల ఎమ్మెల్యేలు ఆనంద్‌, మహేష్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, యాదయ్య, రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌, డీసీసీబీ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, జడ్పీ ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్‌, జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని