logo

తప్పించుకు తిరుగుతున్న నిందితుడి అరెస్ట్‌

లారీ దొంగతనం కేసులో నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Published : 28 May 2023 01:45 IST

అబ్దుల్‌ సలీం

తాండూరు, న్యూస్‌టుడే: లారీ దొంగతనం కేసులో నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం పట్టణంలో 2015లో ఆగి ఉన్న లారీ దొంగతనానికి గురైంది. యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో పట్టణానికే చెందిన లారీ డ్రైవర్‌ అబ్దుల్‌ సలీం నిందితుడని తేల్చారు. ఆగి ఉన్న లారీ నంబరు ప్లేటు మార్చి ఎత్తుకెళ్లాడని గుర్తించారు. ఒకే నంబరు ప్లేటుపై మూడు, నాలుగు లారీలను నడిపే నిందితునిగా  గుర్తించారు. ఈ కేసులో రిమాండ్‌పై జైలుకు వెళ్లి వచ్చిన అబ్దుల్‌ సలీం కోర్టుకు హాజరు కాలేదు. 2019లో  న్యాయస్థానం నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. పోలీసులు గాలించినా ఫలితం లేదు. నెల రోజుల నుంచి  ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ముగ్గురు పోలీసుల బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితుడు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్నాడని సమాచారం అందడంతో అక్కడికి పోలీసులు వెళ్లి నిఘా ఉంచి శుక్రవారం అరెస్టు చేశారు. శనివారం కోర్టులో హాజరు పరిస్తే న్యాయమూర్తి రిమాండుకు పంపించినట్లు సీఐ తెలిపారు.

రూ.20 లక్షల వరకు ఎగనామం

అబ్దుల్‌ సలీం పట్టణానికి చెందిన కొంత మంది దగ్గర రూ.20 లక్షల వరకు డబ్బులు తీసుకుని ఎగ్గొట్టాడు. పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని తెలుసుకున్న బాధితులు స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని వివరించారు. సలీంపై దాడి జరగ వచ్చన్న ముందస్తు జాగ్రత్తతో బాధితులకు సర్ది చెప్పి కేసును మరోసారి పరిశీలిద్దామని పంపించి నట్లు సీఐ చెప్పారు.

కానిస్టేబుళ్లకు రివార్డు

సలీంను అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన శివకుమార్‌, షాబిల్‌ పాష, సాయప్పలకు తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్‌ నగదు రివార్డు ఇచ్చి అభినందించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని