logo

పడితే చినుకు.. పట్టదు కునుకు

వర్షాకాలం కొద్దిరోజుల్లో ఆరంభం కానుంది. వర్షాలు పడుతున్నాయంటే రైతులు ఎంతో సంతోషిస్తారు. సాగుపనులు ముమ్మరం చేస్తారు.

Updated : 29 May 2023 04:45 IST

లోతట్టు ప్రాంతాలకు ముంపు భయం  
ముందస్తు చర్యలకు ప్రజల వినతి  

గతేడాది తాండూరులో రోడ్డుపై చేరిన వరద

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌, పరిగి, తాండూరు: వర్షాకాలం కొద్దిరోజుల్లో ఆరంభం కానుంది. వర్షాలు పడుతున్నాయంటే రైతులు ఎంతో సంతోషిస్తారు. సాగుపనులు ముమ్మరం చేస్తారు. అదే సమయంలో మున్సిపాలిటీలు, పట్టణాల్లోని కాలనీలు, లోతట్టు ప్రాంతాల నివాసితులు మాత్రం తమ ప్రాంతాలు ఎక్కడ ముంపు పాలవుతాయోనని ఆందోళనకు గురవుతారు. ఈసారి వర్షాకాలం ఆరంభం కాకముందే అధికారులు చొరవచూపి ముందస్తు ముంపు నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ ‘పరిశీలనాత్మక’ కథనం.

తడిసి ఎందుకూ పనికిరావు

జిల్లా కేంద్రమైన వికారాబాద్‌ పట్టణంలోని రాజీవ్‌ గృహకల్ప, గంగారం, రామయ్యగూడ, శివరాంనగర్‌, వెంకటేశ్వర కాలనీలలో నేరుగా ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో సామగ్రి, వస్తువులు తడిసిపోయి పనికి రాకుండా పోతున్నాయి. రాజీవ్‌గృహ కల్పలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది.  ఈ కాలనీలో సుమారు 500 గృహాలున్నాయి వీటిలో సగం ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతుంది. గతంలో పట్టణంలో పెద్ద పెద్ద మురికి కాల్వలు ఉండేవి. వీటిని మూసి వేసి అంతర్గత భూగర్భ మురికినీటి కాల్వలను ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు కురిస్తే చాలు ఈ కాల్వల నుంచి నీరు పొంగి ప్రవహించి  ఇళ్లలోకి చేరుతోంది.

పరిగి బీసీ కాలనీలో వరద నీటిని పరిశీలిస్తున్న మున్సిపల్‌ ఛైర్మన్‌ అశోక్‌కుమార్‌

దిగువకు వెళ్లే పరిస్థితి లేదు

తాండూరు పట్టణంలో ఎగువనుంచి వచ్చే వరద నీటితో ఏళ్ల నుంచి గ్రీన్‌సిటీ, మార్కండేయ నగర్‌, ఆదర్శ కాలనీ, కోకట్‌ రోడ్డు, అయ్యప్ప నగర్‌, మాణిక్‌ నగర్‌, ఇందిరానగర్‌, విశ్వంబర కాలనీతో పాటు చిలుక వాగు పరివాహకంగా నిర్మించిన గృహాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరద కాలువల నిర్మాణం లేక పోవడంతో వర్షపు నీరంతా ఇళ్ల మధ్యలోనే నిలిచి పోతుంది. కాలనీల మధ్య నిలిచిన వరదకు  మురుగు తోడవడంతో వర్షాకాలం మొత్తం ఇబ్బందులతోనే గడపాల్సి వస్తోంది.

దశాబ్దాల క్రితం నిర్మాణం

పరిగి మున్సిపాలిటీలో బీసీ కాలనీ, ఖాన్‌ కాలనీలు కాస్త భారీ వర్షం కురిస్తే చాలు జలమయమవుతున్నాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన మురుగు కాల్వలు జనాభా అవసరాలకు  చాలకపోగా పలుచోట్ల దెబ్బతిన్నాయి. వరద నీరంతా నేరుగా ఇళ్లలోకి చేరుతోంది. పన్నెండేళ్ల క్రితం రెండు కాలనీల మీదుగా వరద నీరు సాఫీగా వెళ్లేందుకు పెద్ద కాల్వను నిర్మించారు. దానిపై కొందరు ఏకంగా ఆక్రమణలు చేపట్టినా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించారనే ఆరోపణలున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని