BJP: ప్రధాని మోదీ టార్గెట్‌ విజన్‌-2047: కేంద్ర మంత్రి మేఘ్‌వాల్‌

కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ గృహాలను నిర్మించారని.. అయితే, అవి లబ్ధిదారులకు కాకుండా అధికారులు, రాజకీయ నేతల మధ్య ఎందరికి అందాయో తెలియదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రాం మేఘ్‌వాల్ అన్నారు. 

Published : 29 May 2023 15:54 IST

హైదరాబాద్‌: కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ గృహాలను నిర్మించారని.. అయితే, అవి లబ్ధిదారులకు కాకుండా అధికారులు, రాజకీయ నేతల మధ్య ఎందరికి అందాయో తెలియదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రాం మేఘ్‌వాల్ అన్నారు. మోదీ ప్రధాని అయ్యాక ఇళ్ల నిర్మాణాలకు జియో ట్యాగింగ్‌ చేయడం ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించగలుగుతున్నామని వెల్లడించారు. విజన్‌-2047 టార్గెట్‌గా.. దేశ వికాసానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా ప్రధాని మోదీ స్వయంగా చీపురు పట్టుకున్నారని అన్నారు. దేశంలోని రైల్వే స్టేషన్లనూ అధునాతనంగా తీర్చిదిద్దామని చెప్పారు. ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ పేరుతో తెలంగాణ భాజపా కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మేఘ్‌వాల్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, పలువురు పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ 9ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై పుస్తకాన్ని విడుదల చేశారు.

బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ‘‘గతంలో లబ్ధిదారులకు ప్రభుత్వం రూపాయి పంపిస్తే 15 పైసలే అందేవి. కానీ నేడు ప్రధాని మోదీ కృషి వల్ల పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు ఫలాలు అందుతున్నాయి. అందుకే డీబీటీ (Direct Benefit Transfer) విధానంతో అవినీతికి తావులేకుండా మోదీ ప్రభుత్వం చేసింది’’ అని అన్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్  పేరుతో దేశ ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకే ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని