logo

ఎల్‌ఈడీ వెలుగులతో రూ.600 కోట్లు ఆదా

సరిగ్గా ఆరేళ్ల కిందట ఇదే రోజు (2017, మే 29)న జీహెచ్‌ఎంసీ ఎల్‌ఈడీ వీధి లైట్ల ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది.

Published : 30 May 2023 02:12 IST

నిధులు, పర్యావరణపరంగా నగరానికి ఎనలేని మేలు

దుర్గం చెరువు పరిసరాల్లో వెలుగులు

ఈనాడు, హైదరాబాద్‌: సరిగ్గా ఆరేళ్ల కిందట ఇదే రోజు (2017, మే 29)న జీహెచ్‌ఎంసీ ఎల్‌ఈడీ వీధి లైట్ల ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈఈఎస్‌ఎల్‌ (ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌)తో ఒప్పందం చేసుకుంది. వెన్నెల లాంటి వెలుగునిచ్చే ఎల్‌ఈడీ వీధిలైట్లు అవినీతి, అధిక ఖర్చు వంటి చీకట్లను తరిమేశాయి. నిర్వహణ ఖర్చులు దిగొచ్చాయి. గడిచిన ఆరేళ్లలో విద్యుత్తు ఛార్జీల రూపంలో రూ.600 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది. కాలుష్యం పరంగానూ నగరానికి ఎనలేని లబ్ధి చేకూరింది. ఈ లైట్లతో ఇప్పటివరకు 5.59 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను నియంత్రించగలిగాం.

* 2017కి ముందు బల్దియాకు నెలకు 21 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఖర్చవగా, రూ.15 కోట్ల కరెంటు బిల్లు వచ్చేది. ప్రస్తుతం నెలకు 10 మిలియన్‌ యూనిట్ల కరెంటు ఖర్చవుతోంది. రూ.8.5 కోట్ల బిల్లు వస్తోంది.

* ప్రస్తుతం నగరంలో ఉన్న ఎల్‌ఈడీ వీధిలైట్లు-5,27,315

* ఆరేళ్లలో ఆదా అయిన విద్యుత్తు - 671.81 మిలియన్‌ యూనిట్లు.

మొదటి ఏడాది నుంచే..

సంప్రదాయ వీధిలైట్ల నిర్వహణలో అవినీతి, అడుగడుగునా నేతల ప్రమేయం ఉండేది. వారంతా ఎల్‌ఈడీ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. అనేక సవాళ్లను అధిగమించి, అప్పటి కమిషనర్‌ డాక్టర్‌.బి.జనార్దన్‌రెడ్డి ఈప్రాజెక్టును అమల్లోకి తెచ్చారు. * తొలి ఏడాది పాత వీధి దీపాల స్థానంలో 3,84,290 ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేయించి, రూ.42.42 కోట్ల విద్యుత్తు ఛార్జీల ఆదా చూపించారు. * రెండో ఏడాది 34,568 వీధిలైట్లు ఏర్పాటు చేయగా, రూ.85.85 కోట్ల ఆదా నమోదైంది. * మూడో ఏడాది 33,940 ఎల్‌ఈడీ లైట్లు అమర్చడంతో రూ.84.53 కోట్లు.. * నాలుగో ఏడాది 24,506 ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుతో రూ.111.89 కోట్లు.. * ఐదో సంవత్సరం 20,395 లైట్లతో రూ.154.92 కోట్లు విద్యుత్తు ఛార్జీల రూపంలో బల్దియాకు ఆదా అయ్యింది. * ఆరో ఏట 22 వేల కొత్త వీధి లైట్లు ఏర్పాటవగా రూ.155 కోట్ల మేర భారం తగ్గింది. * అదే సమయంలో బల్దియా కార్యాలయాలపై సౌర ఫలకలు, 122 కొత్త సాంకేతికతతో పనిచేసే ట్రాఫిక్‌ సిగ్నళ్లు, 94 పెలికాన్‌ సిగ్నళ్ల ఏర్పాటు జరిగింది. కొత్త ప్రాంతాల్లో వీధి లైట్లు ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణను ఆన్‌లైన్‌ ద్వారా ప్రతి క్షణం సమీక్షిస్తూ జీహెచ్‌ఎంసీ ఎలక్ట్రికల్‌ విభాగం ఎల్‌ఈడీ ప్రాజెక్టును విజయవంతంగా కొనసాగిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని