హెచ్‌ఎండీఏలో భారీ ప్రక్షాళన!
నగరాభివృద్ధిలో కీలకమైన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)లో ప్రక్షాళన షురూ అయింది.
ఈనాడు, హైదరాబాద్: నగరాభివృద్ధిలో కీలకమైన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)లో ప్రక్షాళన షురూ అయింది. ఇప్పటికే ఇంజినీరింగ్, పరిపాలన విభాగాల్లో భారీగా బదిలీలు చేపట్టిన ఉన్నతాధికారులు తదుపరి ప్రణాళిక విభాగంపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 7,200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏడు జిల్లాల పరిధిలో హెచ్‌ఎండీఏ విస్తరించి ఉంది. శంకర్‌పల్లి, మేడ్చల్, ఘట్‌కేసర్, శంషాబాద్ జోన్లు ఉన్నాయి. వీటి పరిధిలో భారీ భవనాలకు లేఅవుట్లు ఇతర నిర్మాణాలకు అనుమతులు ఇస్తుంటారు. ఆయా ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం, ప్రధాన, లింకు రహదారుల అభివృద్ధి ఇతర కార్యకలాపాలను హెచ్‌ఎండీఏ చూస్తోంది. ఇందులో ఇంజినీరింగ్, ప్రణాళిక, పరిపాలన విభాగాలు కీలకమైనవి. కొన్నేళ్లుగా అధికారుల నుంచి సిబ్బంది వరకు ఒకేచోట పనిచేయడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా పలువురు అధికారుల పనితీరుపై ఆరోపణలున్నాయి. ఇందులో అవినీతి ఆరోపణలు ప్రదానం. ఈ నేపథ్యంలోనే అన్ని విభాగాలను సమూల ప్రక్షాళన చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలివిడతలో ఇంజినీరింగ్, పరిపాలన విభాగాలపై దృష్టి సారించారు. ఇంజినీరింగ్ విభాగంలో ఈఈ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న అధికారులను సమూలంగా మార్చివేశారు. డివిజన్ 1లో ఉన్న అధికారిని డివిజన్‌కు 4కు, డివిజన్ 2లో మరో అధికారిని డివిజన్ 3(బీపీపీ)కు, శంకర్‌పల్లిలో జోన్‌లో ఉన్న మరో అధికారిని సీఈ పేషీకి బదిలీ చేశారు. మరో ఈఈ స్థాయి అధికారిని హెచ్‌జీసీఎల్‌కు పంపారు. అలాగే పరిపాలన విభాగంలో కీలక స్థానాల్లో ఉన్న 14 మంది డీఏవోలకు స్థానచలనం కల్పించారు. అకౌంట్స్ సెక్షన్‌లో పనిచేసే ఓ అధికారిపై ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తుండటంతో ఆయన్ని లీగల్‌సెల్‌కు బదిలీ చేశారు.
ప్రణాళిక విభాగంపై దృష్టి
ప్రణాళిక విభాగంలోని నాలుగు జోన్ల పరిధిలో పీవో, ఏపీవో, జేపీవో స్థాయిల్లో దాదాపు 20 మందిపైనే పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన వారే. పీవో, ఏపీవో స్థాయిలో పలువురు ఐదారేళ్ల నుంచి ఒకే స్థానంలో విధులు నిర్వహిస్తున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. భవనాల, లేఅవుట్ల అనుమతులు, ఇతరత్రా పనుల కోసం దళారులతో కుమ్మక్కై అందినకాడికి మింగుతున్నారనే విమర్శలూ ఉన్నాయి. భవనాలు, లేఅవుట్లకు దరఖాస్తు చేసుకున్నాక టీఎస్‌బీపాస్ చట్టం ప్రకారం 21 రోజుల్లో అనుమతులివ్వాలి. కొందరు ఏపీలు, జేపీవోలు నిర్ణీత సమయం కంటే ఎక్కువ రోజులు తమ వద్ద దస్త్రాలు పెట్టుకున్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో ఇలాంటి వారిపై జరిమానా వేశారు. అయినా కొందరిలో మార్పు రాకపోవడంతో మూడేళ్లు దాటిన వారికి స్థానచలనం కల్పించాలని భావిస్తున్నారు. ఒకటీరెండు రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Pakistan: అఫ్గాన్ సైనికుడి కాల్పులు.. ఇద్దరు పాక్ పౌరులు మృతి
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/10/2023)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Vande Bharat: కాషాయ రంగులో ‘వందేభారత్’.. రైల్వే మంత్రి వివరణ ఇదే!
-
సల్మాన్ సినిమా ఫ్లాప్.. నన్ను చచ్చిపోమన్నారు: హీరోయిన్
-
Hyderabadi Biryani: హైదరాబాదీ బిర్యానీ X కరాచీ బిర్యానీ.. పాక్ ఆటగాళ్లు ఎంత రేటింగ్ ఇచ్చారంటే?