logo

నెట్‌లో పడకు.. వంచనకు గురికాకు

ఇప్పుడంతా అతర్జాల (ఇంటర్‌నెట్‌) మయం. ఫేస్‌బుక్‌, వాట్సప్‌ ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాలు యువతనే కాదు, పెద్దవారిని సైతం తమవైపు లాగేసుకుంటున్నాయి.

Published : 30 May 2023 02:12 IST

మోసపోతున్న వారిలో యువతే అధికం
సద్వినియోగం మన చేతుల్లోనే

సామాజిక మాధ్యమాలు, అంతర్జాల వినియోగంపై పోలీసుల అవగాహన

న్యూస్‌టుడే, వికారాబాద్‌, తాండూరు: ఇప్పుడంతా అతర్జాల (ఇంటర్‌నెట్‌) మయం. ఫేస్‌బుక్‌, వాట్సప్‌ ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాలు యువతనే కాదు, పెద్దవారిని సైతం తమవైపు లాగేసుకుంటున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా నెట్టింట పెరిగిపోతున్న నయవంచకులు చేస్తున్న మోసాలకు యువతీ యువకులు తీవ్రంగా నష్టపోతున్నారు. 

60 శాతానికిపైగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం

దాదాపుగా 14 లక్షల మంది జనాభా ఉన్న  జిల్లాలో 60 శాతానికి పైగా స్మార్ట్‌ఫోన్లను ఉపయోగిస్తుంటే అందులో 22 శాతం మంది మహిళలే ఉండటం గమనార్హం. అంతర్జాలంలో మన ప్రొఫైల్‌ చిత్రం ఆధారంగా చాలా మంది అపరిచితులు పలకరిస్తుంటారు. వాటికి మనం స్పందించి సమాధానమిస్తే వారి ఉచ్చులో పడినట్లే. ఇటీవల కాలంలో మోసపోతున్నవారిలో ఎక్కువ మంది విద్యాధికులే ఉండటం గమనార్హం. మోసగించిన వ్యక్తులతో తమకు గత పరిచయం లేదని చెబుతుండటంతో పోలీసులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

172 అవగాహన కార్యక్రమాలు 

జిల్లాలోని 18 పోలీస్‌ఠాణాల పరిధిలో పోలీసులు నెలకు 5 సమావేశాలు నిర్వహస్తూ సామాజిక మాధ్యమాలు, అంతర్జాలాన్ని వినియోగించుకునే తీరుపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పోలీసు కళాజాత బృందాల ద్వారా 172 కార్యక్రమాలు నిర్వహించారు. * అంతర్జాలాన్ని, సామాజిక మాధ్యమాలను వినియోగించుకునేటప్పుడు కొన్ని నియమాలను, హద్దులను పెట్టుకోవాలి. అప్పుడే ఎలాంటి ఇబ్బంది ఉండదని పోలీసులు పేర్కొంటున్నారు.  

కొన్ని ఉదాహరణలు

* వికారాబాద్‌కు చెందిన ఓ యువతి హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన రాజధాని నగరానికి చెందిన ఓ యువకునితో వ్యక్తిగతంగా పలుమార్లు కలుసుకుంది. ఇద్దరి మధ్య కుదిరిన స్నేహం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
* కొన్నాళ్ల క్రితం తాండూరుకు చెందిన ఓ యువతి స్నేహితుడే కదా అని ఏకాంతంగా ఉన్న స్వీయ చిత్రాలను (సెల్ఫీ) పంపించింది. ఇదే అదనుగా అతను బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించాడు. చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించింది.
* గత ఏడాది వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ తన భర్త చేస్తున్న అకృత్యాలను, వేధింపులను ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ద్వారా పంచుకోవడంతో నేరుగా పోలీసులే రంగప్రవేశం చేసి అదుపులోకి తీసుకున్నారు.  
* ఈ తరహా ఫిర్యాదులపై గత 4 నెలల్లో 18 కేసులు నమోదయ్యాయి.


అపరిచితులను నమ్మకండి

ఎన్‌.కోటిరెడ్డి, ఎస్పీ

సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటున్న యువతీ, యువకులే కాదు, పెద్దలు సైతం నిత్యం అప్రమత్తంగా ఉండాలి. అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత విషయాలను పంచుకోకూడదు.  ముఖ్యంగా మహిళలు చాలా అప్రమత్తంగా ఉండాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని